ఆదివాసీ సంప్రదాయం ప్రకారం పూజలు నిర్వహించే మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతరలో ఆదివాసీ యువత పాత్ర కీలకంగా నిలుస్తుంది.అమ్మవార్ల జాతర మొదలు నుండి ముగింపు వరకు అమూల్యమైన సేవలు అందిస్తున్నారు.
మేడారం పరిసర గ్రామల ఆదివాసి యువకులు తమ ఆరాధ్య దైవంగా కొలిచే సమ్మక్క సారలమ్మలకు ప్రత్యేక పూజలు నిర్వహించి గ్రామస్థులతో కలిసి మండమెలిగా పండుగ నాటి నుండి అమ్మవార్లు వన ప్రవేశం చేసే వరకు మేడారం మహా జాతరలో అద్భుత సేవలు అందిస్తున్నారు.
ఒక పక్క వనదేవతల పూజ కార్యక్రమాలలో భక్తి శ్రద్ధలతో పాల్గొంటూ ఆదివాసీ సంప్రదాయలను కాపాడుకుంటూ జాతర పనులలో ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. సారలమ్మ రాక సందర్భంగా, సమ్మక్క రాక సందర్భంగా పోలీసులతో పాటుగా వారు పాల్గొని, అన్ని జాగ్రత్తలు పాటిస్తూ అమ్మవార్లను గద్దెల వద్దకు తీసుకువస్తారు.
గద్దెల ప్రాంగణంలో ఉంటూ అమ్మవార్ల దర్శనానికి వచ్చే భక్తులకు సేవలు అందిస్తూ భక్తులు సమర్పించే కానుకలను జాగ్రత్త చేయడంతో పాటు భక్తులకు సహకరిస్తూ మేడారం జాతర నిర్వహణలో తమదైన పాత్ర పోషిస్తున్నారు.