MLC Kavitha : కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతాపార్టీ(బీజేపీ)పై తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) ఎమ్మెల్సీ కవిత తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బీజేపీ నేతలు రాముడి పేరు చెప్పి రౌడీయిజం చేస్తున్నారని మండిపడ్డారు. ఈడీ దాడులకు భయపడే ప్రసక్తే లేదన్నారు. ఎల్లారెడ్డిపేట మండల పరిధిలోని నాగిరెడ్డిపేటలో నిర్వహించిన టీఆర్ఎస్ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో కవిత పాల్గొని ప్రసంగించారు.
తెలంగాణ మంత్రులపై నెల రోజుల నుంచి ఐటీ, ఈడీ దాడులు జరుగుతున్నాయన్నారు. లీగల్‌గా వ్యాపారం చేసుకుంటున్నప్పటికీ బీజేపీ తెలంగాణలో ఈడీ, ఐటీ దాడులు చేయిస్తోందన్నారు. ఒక్క మంత్రిని గాని, ఎమ్మెల్యేను గానీ, ఎంపీని గాని విడిచిపెట్టడం లేదన్నారు. తెలంగాణ వాళ్లు భయపడేవాళ్లు కాదని కవిత స్పష్టం చేశారు.
టీఆర్ఎస్ ఎమ్మెల్యేను కొనేందుకు కొందరు ప్రయత్నించారు. అడ్డంగా దొరికిన ఆ దొంగలను విచారణ చేయకుండా పిటిషన్లు వేశారు. న్యాయస్థానం నుంచి స్టే కూడా
తెచ్చారు. అయినా తాము వెనక్కి తగ్గకుండా సుప్రీం కోర్టుకి వెళ్లి ఆర్డర్ తెచ్చుకున్నట్లు కవిత చెప్పారు. యాదగిరిగుట్టకు వెళ్లి బండి సంజయ్ దొంగ ప్రమాణాలు చేశారంటూ విమర్శించారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బీఎల్ సంతోష్ పేరు బయటకు వచ్చింది. ఆయనను విచారణకు రమ్మంటే పారిపోయాడు. కోర్టుల్లో పిటిషన్లు వేసి విచారణకు రాకుండా అడ్డుకుంటున్నారని కవిత తెలిపారు.
బండి సంజయ్ నిన్న సభ పెట్టి ఏడ్చారు. తప్పు చేయనప్పుడు భయమెందుకు..? వాళ్ల నాయకులంతా మంచోళ్లేనని చెప్పే బండి సంజయ్.. బీఎల్ సంజయ్‌ని అరెస్ట్ చేయొద్దని కోర్టుకు ఎందుకు వెళ్లాడని కవిత ప్రశ్నించింది. టీఆర్ఎస్ మంత్రులు ఐటీ, ఈడీ, సీబీఐ ఇలా ఎవరు పిలిచినా వెలుతున్నారని చెప్పారు. తప్పు చేయలేదు కాబట్టే భయం లేకుండా విచారణకు హాజరు అవుతున్నారన్నారు. ఈడీ దాడులకు భయపడం అని కవిత చెప్పారు.