Sharmila padayatra : వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పాదయాత్రకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే.. కొన్ని షరతులు విధించింది. సీఎం కేసీఆర్‌పై ఎలాంటి రాజకీయ పరమైన, మతపరమైన అభ్యంతరకర వ్యాఖ్యలు చేయొద్దని ఆదేశించింది. పాదయాత్ర కోసం మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని సూచించిన హైకోర్టు పాదయాత్రకు అనుమతి ఇవ్వాలని పోలీసులను ఆదేశించింది.
షర్మిల చేపట్టిన పాదయాత్రకు నర్సంపేట పోలీసులు అనుమతి రద్దు చేశారని హైకోర్టులో వైఎస్సార్టీపీ సభ్యుడు రవీంద్రనాథ్ రెడ్డి లంచ్‌మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. పాదయాత్రకు టీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డంకులు సృష్టించారని పిటిషన్‌లో పేర్కొన్నారు. పాదయాత్రకు అనుమతించాలంటూ కోరారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం షర్మిల పాదయాత్రకు అనుమతి ఇచ్చింది.
సోమవారం వరంగల్‌లో బస్సుకు నిప్పు పెట్టిన ఘటనకు నిరసగా మంగళవారం ప్రగతిభవన్ ముట్టడికి బయలుదేరిన షర్మిలను పంజాగుట్ట చౌరస్తా వద్ద పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేసి ఎస్ఆర్‌నగర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కుమార్తెను చూసేందుకు ఎస్ఆర్‌నగర్ పోలీస్ స్టేషన్‌కు బయలుదేరిన వైఎస్ విజయమ్మను పోలీసులు ఇంటి వద్దే అడ్డుకున్నారు. మరోవైపు షర్మిలపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది.