Telangana Irrigation Department : కాళేశ్వరం ప్రాజెక్టులోని ముఖ్య నిర్మాణాలైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల పునరుద్ధరణ కోసం రేవంత్ సర్కార్ కసరత్తు చేస్తుంది. అందుకై సమగ్ర ప్రణాళికతో కూడి డిజైన్లను అందించడానికి రాష్ట్ర నీటిపారుదల శాఖ ఆసక్తి గల ప్రతిష్టాత్మక సంస్థను ఆహ్వానించింది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ ఆథారిటీ (ఎన్డీఎస్‌ఏ) నిపుణుల కమిటీ సిఫారసులకు అనుగుణంగా డిజైన్లను రూపొందించాలని బుధవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.
అవసరమైన సేవలు మరియు సమీక్షలు: ఎంపికైన సంస్థ కొన్ని కీలక సేవలను అందించాల్సి ఉంటుంది. బరాజ్‌ల ప్రస్తుత పటిష్టతపై మదింపు మరియు హైడ్రాలజీ, హైడ్రాలిక్ రివ్యూ నిర్వహించాలి. వరదలు, భూకంపాలు వంటి విపత్తులను ఎదుర్కొనేందుకు బరాజ్‌ల సామర్థ్యాన్ని అంచనా వేయాలి. గేట్లు, పియర్లు, స్టిల్లింగ్ బేసిన్, కటాఫ్ వాల్స్ వంటి కీలక విభాగాలను పటిష్టం చేసేందుకు డిజైన్లను అందించడం లాంటి సేవలు అందించాలి.
Also Read:https://teluguprabha.net/telangana-news/vc-sajjanar-hyderabad-police-commissioner-priorities/
క్షేత్ర స్థాయి పరీక్షలు, లోపాల గుర్తింపు: సంస్థలు బరాజ్‌ల ప్రస్తుత డిజైన్లను, ఎన్‌డీఎస్‌ఏ నివేదికలను లోతుగా సమీక్షించాల్సి ఉంటుంది. అవసరమైతే క్షేత్ర స్థాయిలో పర్యటించి జియోటెక్నికల్, జియోఫిజికల్ వంటి పరీక్షలు నిర్వహించి నిర్మాణాలలో ఉన్న అన్ని రకాల లోపాలను కచ్చితంగా గుర్తించాలని నీటిపారుదల శాఖ సూచించింది. ముఖ్యంగా మేడిగడ్డ బరాజ్‌లో కుంగిపోయిన 7వ బ్లాకును పటిష్టం చేయడం లేదా సురక్షితంగా తొలగించే అంశంపై అధ్యయనం చేసి తగిన పరిష్కారాలను సూచించాలని కోరింది.
సంస్థల అర్హతలు: సంస్థ అందించే తుది డిజైన్లు మరియు డ్రాయింగ్స్‌కు తప్పనిసరిగా కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) ఆమోదం తెలపాల్సి ఉంటుంది. ఆసక్తి గల సంస్థ లేదా జాయింట్ వెంచర్ గత 15 ఏళ్లలో కనీసం ఒకటి లేదా రెండు ప్రాజెక్టుల పునరుద్ధరణకు సంబంధించిన ఇలాంటి పనులను విజయవంతంగా పూర్తి చేసి ఉండాలనే అర్హతను ప్రభుత్వం నిర్దేశించింది. ఈ ప్రక్రియ కాళేశ్వరం ప్రాజెక్టు బరాజ్‌ల భద్రతను, దీర్ఘకాలిక మనుగడను పెంచడంలో కీలక పాత్ర పోషించనుంది.


