TSRTC : తెలుగు ప్రజలు జరుపుకునే అతి పెద్ద పండుగ సంక్రాంతి. ఉద్యోగాలు, ఇతర పనుల నిమిత్తం వేరే ఊర్లో ఉండే వారు సైతం సంక్రాంతికి సొంతూళ్లకు వెలుతుంటారు. ఇలాంటి వారికి తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) శుభవార్త చెప్పింది. పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకుని 4,233 ప్రత్యేక బస్సుల నడపాలని నిర్ణయించింది. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాలకు జనవరి 7 నుంచి 15 వరకు ఈ ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు టీఎస్ ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ తెలిపారు.
గత సంవత్సరంతో పోలిస్తే ఈ సారి 10 శాతం అదనంగా బస్సులను నడుపుతున్నట్లు చెప్పారు. అమలాపురంకు 125, కాకినాడకు 117, కందుకూరుకు 83, విశాఖపట్నంకు 65, పోలవరానికి 51, రాజమండ్రికి 40 ప్రత్యేక సర్వీసులను కేటాయించారు. ప్రత్యేక బస్సుల్లో 585 సర్వీసులకు ముందస్తు రేజర్వేషన్ సదుపాయం ఉంది. ప్రయాణీకుల సౌకర్యార్థం 60 రోజుల ముందుగానే అడ్వాన్స్‌డ్ టికెట్ బుకింగ్ సదుపాయం కల్పించారు. కాగా.. ఇంతకముందు ఇది 30 రోజుల ముందుగా మాత్రమే ఉండేది. వచ్చే ఏడాది జూన్ వరకు ఈ సౌకర్యం కొనసాగనుంది.