Tummala Nageswara Rao VS Telangana Govt: తెలంగాణలో రైతుల కోసం పెద్దఎత్తున పథకాలు అమలు చేస్తున్నా, వాటి ఫలితాన్ని ప్రజల్లో సరిగా చాటి చెప్పడంలో ప్రభుత్వం ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పనితీరుపై పార్టీ శ్రేణుల నుంచే ప్రశ్నలు,అభ్యంతరాలు తలెత్తుతున్నాయి. సర్కారు ఇప్పటి వరకు పంట రుణమాఫీ, భరోసా, బోనస్ వంటి పథకాల ద్వారా రైతులకు పెద్దఎత్తున సహాయం చేసినా, యూరియా సరఫరా విషయంలో తుమ్మల వైఫల్యం మొత్తం సమీకరణాన్ని తారుమారు చేసిందని విమర్శలు వినపడుతున్నాయి.
ఎరువుల కొరత…
దేశవ్యాప్తంగా ఎరువుల కొరత ఉండగానే ఆ సమస్యను ముందుగానే గుర్తించి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడుతున్నారు కాంగ్రెస్ నేతలు. కానీ తుమ్మల వైఖరి వల్లే రైతులు నష్టపోయారని ఆరోపణలు వస్తున్నాయి. దీంతో ఈ అంశం ప్రతిపక్షానికి పెద్ద ఆయుధంగా మారింది.
Also Read: https://teluguprabha.net/devotional-news/things-you-should-not-store-in-kitchen-spice-box/
మంత్రిగా ఉన్నప్పటికీ ఆయనకు తోటి సహచరులతో సరైన సమన్వయం లేదని పార్టీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. అధిష్ఠానంతోనే సంబంధాలు పరిమితం చేసి, సహచర మంత్రులతో దూరంగా ఉండటం ప్రభుత్వానికి తలనొప్పిగా మారిందని విశ్లేషకులు చెబుతున్నారు. అంతేకాకుండా కీలకమైన వ్యవసాయశాఖలో ఆయిల్ పామ్ ప్రోత్సాహానికే పరిమితమై, యూరియా పంపిణీ వంటి అత్యవసర అంశాలను నిర్లక్ష్యం చేయడం ఆశ్చర్యంగా మారింది.
అధిష్ఠానానికి లేఖలు..
రైతుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపట్టినా, వాటిని సరైన విధంగా ప్రదర్శించలేకపోవడం పెద్ద లోటుగా నిలుస్తోంది. ఇప్పటికే కొంతమంది స్థానిక నాయకులు అధిష్ఠానానికి లేఖలు రాసి తమ అసంతృప్తి తెలిపారని సమాచారం. కొంతమంది నేతలు నేరుగా ఢిల్లీలో ఫిర్యాదులు కూడా చేసినట్లు తెలిసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ శాఖ పట్ల శ్రద్ధ చూపడంలేదని, దీనికి కారణం తుమ్మలనే అన్న భావన పార్టీ వర్గాల్లో ఉంది. ఇదే తరహా పరిస్థితి కొనసాగితే స్థానిక ఎన్నికల్లో పార్టీకి గట్టి దెబ్బ తగులుతుందన్న ఆందోళన కాంగ్రెస్ శ్రేణుల్లో స్పష్టంగా కనిపిస్తోంది.
మంత్రివర్గంలో మార్పులు..
ఇటీవల జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తర్వాత మంత్రివర్గంలో మార్పులు ఉండవచ్చని ప్రచారం బలంగా వినిపిస్తోంది. ముఖ్యంగా వ్యవసాయశాఖలో తక్షణ చర్యలు అవసరమని పార్టీ నేతలు భావిస్తున్నారు.
ఖమ్మం జిల్లాకు చెందిన మరో ఇద్దరు మంత్రులు—పొంగులేటి శ్రీనివాసరెడ్డి, భట్టి విక్రమార్క—తమ శాఖల్లో విజయవంతంగా ముందుకు వెళ్తున్నారనే నివేదికలు పార్టీకి చేరుతున్నాయి. ‘ఇందిరమ్మ ఇండ్ల’ కార్యక్రమం ద్వారా పొంగులేటి, ఆర్థిక నిర్వహణలో భట్టి సానుకూల ఫలితాలు చూపుతుండగా, అదే జిల్లాకు చెందిన తుమ్మల మాత్రం ప్రతికూల చర్చలకు కారణమవుతున్నారు. ఈ పరిస్థితి పార్టీ లోపలే అసంతృప్తికి దారితీస్తోంది.
గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలోనూ తుమ్మల మంత్రిగా పనిచేశారు. ఆ సమయంలో కూడా ఆయన పనితీరుపై విమర్శలు వచ్చి, కేసీఆర్ ఆయనను పక్కన పెట్టారని అప్పటి చర్చ. ఇప్పుడు కాంగ్రెస్ హయాంలోనూ ఆయన ధోరణి కొనసాగడం ప్రభుత్వానికి తలనొప్పిగా మారిందని భావిస్తున్నారు. సీనియర్ నేతగా పాలనలో తోడ్పాటుగా ఉంటారని ఆశించి కేబినెట్‌లోకి తీసుకున్నా, ఇప్పుడు ఆయన శైలి సమస్యగా మారిందని అంటున్నారు.
రుణమాఫీ సౌకర్యం..
అయితే రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం ఇప్పటి వరకు భారీ ఖర్చు చేసింది. గడిచిన ఇరువై నెలల్లోనే రాష్ట్రం మొత్తం రూ.1.04 లక్షల కోట్లు రైతుల కోసం వినియోగించింది. 25 లక్షల మందికి పైగా రైతులు రుణమాఫీ సౌకర్యం పొందారు. 65 లక్షల మందికి పైగా రైతులు ‘రైతు భరోసా’ కింద నేరుగా ఆర్థిక సహాయం పొందారు. 24 గంటల ఉచిత విద్యుత్తు అందిస్తూ 29 లక్షల పంపుసెట్లకు సబ్సిడీగా రూ.16,691 కోట్లు చెల్లించారు. సోలార్ విద్యుత్తు ప్రోత్సాహంలోనూ ప్రభుత్వం ముందంజలో ఉంది.
ధాన్యం కొనుగోళ్లలోనూ తెలంగాణ ముందంజలో ఉంది. ఇప్పటి వరకు రూ.29,562 కోట్ల విలువైన ధాన్యం కొనుగోలు చేసి, 21 లక్షల మందికి పైగా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేశారు. సన్న వడ్లకు క్వింటాలుకు రూ.500 బోనస్ చెల్లించడంతో దిగుబడులు కూడా పెరిగాయి. ఈ ఏడాది 2.80 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తితో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది.
అకాల వర్షాలు, వరదల కారణంగా పంటలు నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.10 వేల చొప్పున పరిహారం ఇచ్చారు. గతంలో నిలిచిపోయిన 16 కేంద్ర పథకాలను కూడా పునరుద్ధరించి రైతులకు అందించారు. ఆయిల్ పామ్ సాగులోనూ రాష్ట్రం దేశంలోనే ముందంజలో ఉంది
బిందు, తుంపర సేద్య పరికరాలపై ప్రభుత్వం భారీ రాయితీలు ఇస్తోంది. ఎస్సీ, ఎస్టీ రైతులకు 100 శాతం, చిన్నకారు రైతులకు 90 శాతం, మిగిలిన వారికి 75 శాతం రాయితీ ఇవ్వడం ద్వారా వేలాది మంది రైతులు లాభం పొందారు. డిసెంబర్ 2023 నుంచి ఇప్పటివరకు 40 వేల మందికి పైగా రైతులు రూ.282 కోట్ల విలువైన పరికరాలు పొందారు.
ఈ స్థాయి సహాయాలు అందించినా, యూరియా సమస్యపై మంత్రిత్వ వైఫల్యం సర్కారు ప్రతిష్టను దెబ్బతీస్తోందని విమర్శలు వస్తున్నాయి. రైతు సంక్షేమం కోసం చేసిన మేలును చెప్పుకోలేకపోవడానికి కారణం తుమ్మల తీరే అన్న అభిప్రాయం పార్టీ అంతర్గతంగా బలపడుతోంది.
తద్వారా ఆయన భవిష్యత్తు కేబినెట్‌లో కొనసాగుతారా లేదా అన్న చర్చ ఇప్పుడు హైకమాండ్ పరిధిలో కొనసాగుతోంది. తక్షణ మార్పు ఉంటుందా లేదా కేబినెట్ విస్తరణలో భాగంగానా అన్నది చూడాల్సి ఉంది.


