Minister Tummala:కేంద్ర ప్రభుత్వం అమెరికా పత్తిపై దిగుమతి సుంకాన్ని ఎత్తివేయడం రైతుల ప్రయోజనాలను తాకట్టు పెట్టడమేనని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మండిపడ్డారు. పామాయిల్ పంటపై దిగుమతి సుంకాలను పెంచి పామాయిల్ రైతులను రక్షించాలని కోరితే పట్టించుకోని పాలకులు అమెరికా పత్తిపై సుంకాన్ని ఎత్తివేయడం కేంద్ర ద్వంద్వ వైఖరిని ప్రతిబింబిస్తోందన్నారు. ఈ మేరకు మంగళవారం ప్రకటన విడుదల చేశారు. భారతదేశం ప్రపంచంలోనే అతి పెద్ద పత్తి ఉత్పత్తిదారుల్లో ఒకటైనప్పటికీ, అమెరికా ఒత్తిడికి లోనై పత్తి దిగుమతులపై అమల్లో ఉన్న 11 శాతం సుంకాన్ని మోడీ ప్రభుత్వం ఎత్తివేయాలని తీసుకున్న నిర్ణయంతో దేశీయ రైతులకు అన్యాయం జరుగుతుందన్నారు. ఈ మినహాయింపును డిసెంబర్ 31 వరకు పొడిగించడం రైతుల ప్రయోజనాలకు వ్యతిరేకమన్నారు. రైతుల ప్రయోజనం తమ ప్రథమ కర్తవ్యమని, అంతర్జాతీయ సదస్సులో ప్రకటించిన కొద్ది రోజులకే రైతుల హక్కులను త్యాగం చేసేలా ప్రధాని మోడీ నిర్ణయం తీసుకోవడం ఆశ్చర్యకరంగా ఉందన్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన 50 శాతం దిగుమతి సుంకాల ఒత్తిడిని ఎదుర్కొనేందుకు ప్రత్యామ్నయంగా ఫినిష్డ్ గూడ్స్ ఎగుమతులకు ఆర్థిక సాయం, ఫ్రెయిట్ సబ్సిడీలు లాంటి ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని కానీ టెక్స్‌టైల్ ఎగుమతిదారులకు చవక ముడి సరుకు సమకూర్చేందుకు కేంద్రం దేశీయ పత్తి రైతులను త్యాగం చేయడం తీవ్ర అన్యాయమన్నారు. ఈ నిర్ణయంతో రైతులకు, ప్రభుత్వానికి, కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు పెద్ద నష్టం కలుగుతుందని, పత్తికి కేంద్రం కనీస మద్ధతు ధర ప్రకటించి ఆ ధరకు సీసీఐ రైతుల నుండి సేకరిస్తున్నప్పటికీ, ఈ సేకరణ 50 శాతం మంది రైతులకు మించి జరగకపోవడంతో ఈ మద్ధతు ధర కంటే, డిమాండ్‌కు అనుగుణంగా బహిరంగ మార్కెట్‌లో అధిక ధర లభించే అవకాశాన్ని రైతులు కోల్పోనున్నారు. కేంద్రం అసమర్థతతో దేశంలో ఇప్పటికే యూరియా కొరతతో రైతులు ఇబ్బంది పడుతున్నారని, కేంద్రం ఇలాంటి నిర్ణయం తీసుకోవడంతో పత్తి రైతులు ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉందన్నారు.
అమెరికా ఒత్తిడికి తలొగ్గిన కేంద్రం
మోడీ ప్రభుత్వం దేశీయ రైతుల ప్రయోజనాలను పక్కన పెట్టి అమెరికా ఒత్తిడికి తలవంచిందని మంత్రి తుమ్మల ఖండించారు. రైతు ప్రయోజనాల కోసం రాష్ర్ట ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని, అవసరమైతే దేశవ్యాప్తంగా రైతు సంఘాలతో కలసి ఉద్యమం చేపడతామన్నారు. దేశవ్యాప్తంగా యూరియా, ఎరువుల కొరత తీవ్రమైన స్థాయిలో కనిపిస్తోందని, 2024 ఆగస్టులో 86.43 లక్షల టన్నులుగా ఉన్న యూరియా నిల్వలు, 2025 ఆగస్టులో కేవలం 37.19 లక్షల టన్నులకు పడిపోయిందన్నారు. రష్యా – ఉక్రెయిన్ యుద్ధం, చైనా సరఫరా నిలిపివేయడం, మధ్యప్రాచ్య క్రూడ్ ఆయిల్ ధరల పెరుగుదల లాంటి అంశాలు ఈ సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేశాయని పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితులు మన దేశ వ్యవసాయ రంగ భవిష్యత్తుపై కేంద్రం, రాష్ట్రాలతో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటుచేసే ఆవశ్యకతను తెలియజేస్తుందన్నారు. దీర్ఘకాలంలో ఫాసిల్ ఫ్యూయల్ ఆధారిత వ్యవసాయం నుండి దశలవారీగా బయటపడటం అవసరన్నారు. కనీసం 40 నుంచి 50 శాతం వ్యవసాయ భూములను ఎరువులపై ఆధారపడని సేంద్రియ పద్ధతులకు మార్చాలని, దీనికి తగ్గట్టు పెద్ద ఎత్తున రాష్ట్రాలకు ప్రోత్సాహకాలు అందించాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వం 10 శాతం వ్యవసాయ భూమిని ఆర్గానిక్ ఫార్మ్స్‌గా మార్చే లక్ష్యంతో ముందుకు సాగుతోందన్నారు. ఇందుకోసం మార్పు కాలం మూడేళ్లపాటు రైతులకు కేంద్ర ప్రభుత్వం ఆదాయ మద్దతు ఇవ్వాలని, ఆర్గానిక్ పంటలకు ప్రత్యేక కనీస మద్దతు ధర ప్రకటించడమే కాకుండా, పటిష్టంగా రైతులకు ఆ ఆదాయం దక్కెటట్లు విధానాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.


