Panchayat Elections Schools Holiday: తెలంగాణలో పంచాయతీ ఎన్నికల సందడి కొనసాగుతోంది. ఏకగ్రీవాలు, వేలం పాటలతో కొన్ని చోట్ల సర్పంచ్ పదవులకు అభ్యర్థులు ఖరారు కాగా.. మిగిలిన గ్రామాల్లో ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు పకడ్బందీగా జరుగుతున్నాయి. ఈ నెల 11, 14, 17 తేదీల్లో మూడు విడతల్లో ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఈ క్రమంలో స్కూళ్లకు సెలవులపై ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది.
ఈ నెల 11న తొలి విడత పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ జరిగే గ్రామాల్లోని స్కూళ్లకు రెండు రోజులు సెలవు ఇస్తూ ఆయా జిల్లాల డీఈఓలు ఉత్తర్వులు జారీ చేశారు. పోలింగ్ జరిగే పాఠశాలలకు 10, 11 తేదీల్లో సెలవు ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 10వ తేదీన పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లను పర్యవేక్షించనున్నారు. 11వ తేదీన పోలింగ్ జరగనుంది. కాగా, తొలి విడతలో 4,236 గ్రామాల్లో పోలింగ్ జరగనుంది. ఉపాధ్యాయులు విధుల్లో పాల్గొననున్నారు.
Also Read: https://teluguprabha.net/telangana-news/cm-revanth-reddy-speech-in-telangana-rising-global-summit/
ఇక, రెండో విడతలో(ఈ నెల 14న) 4,333 గ్రామాల్లో పోలింగ్ నిర్వహించనున్నారు. ఆ రోజు ఆదివారం కావడంతో ప్రత్యేకంగా సెలవు అనేది ఏం ఉండదు. కాగా పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్ల దృష్ట్యా ముందు రోజు(డిసెంబర్ 13) సెలవు ఉండే అవకాశం ఉంది. ఇకపై ఈ నెల 17న మూడో విడత ఎన్నికల్లో 4,159 గ్రామాల్లో సర్పంచ్, వార్డు స్థానాలకు ఓటింగ్ జరగనుంది. ఆ రోజులకి సంబంధించి పాఠశాలలకు సెలవులపై త్వరలో ప్రకటన విడుదలయ్యే అవకాశం ఉంది.
కాగా, రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు రెండు విడతల్లో కలిపి 810 మంది సర్పంచ్‌లు, 17,635 మంది వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల సంఘం ప్రకటనలో తెలిపింది. మిగిలిన స్థానాలకు త్వరలోనే పోలింగ్ జరగనుంది. రెండో విడతలో మొత్తం 415 మంది సర్పంచ్ అభ్యర్థులు, 8,304 మంది వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కామారెడ్డి జిల్లాలో అత్యధికంగా 44 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. నల్గొండ, నిజామాబాద్ జిల్లాల్లో 38 మంది చొప్పున సర్పంచ్‌లుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

