Telangana Students Killed In UK Car Collision: ఉన్నత విద్య కోసం బ్రిటన్ వెళ్లిన ఇద్దరు తెలంగాణ విద్యార్థులు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన బ్రిటన్ ఆగ్నేయ ప్రాంతంలోని ఎసెక్స్ పట్టణంలో సోమవారం తెల్లవారుజామున జరిగింది. ఈ విషాద ఘటన తెలంగాణతో పాటు బ్రిటన్‌లో ఉన్న భారతీయ సమాజాన్ని షాక్‌కు గురి చేసింది.
ALSO READ: Challans on CM Canvoy: సీఎం రేవంత్ రెడ్డి కాన్వాయ్ వాహనాలపై 18 చలాన్లు!
గణేష్ నిమజ్జనం నుంచి వస్తుండగా..
మృతులలో ఒకరు చైతన్య తారే (23) కాగా, మరొకరు రిషి తేజ రాపోలు (21). ఎసెక్స్‌లోని రేలీ స్పర్ రౌండ్‌అబౌట్ వద్ద రెండు కార్లు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే చైతన్య తారే అక్కడికక్కడే మరణించాడు. రిషి తేజ రాపోలు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. వీరు గణేష్ నిమజ్జనం వేడుకల నుంచి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. తీవ్రంగా గాయపడిన మరో ఐదుగురు విద్యార్థులను స్థానిక ఆసుపత్రిలో చేర్చగా, వారికి అత్యవసర వైద్య చికిత్స అందిస్తున్నారు.
ఇద్దరు డ్రైవర్ల అరెస్ట్
ప్రమాదానికి కారణమైన రెండు కార్ల డ్రైవర్లను ఎసెక్స్ పోలీసులు అరెస్టు చేశారు. వారిద్దరూ బార్కింగ్ నివాసితులు. 23, 24 సంవత్సరాల వయసున్న ఆ ఇద్దరు డ్రైవర్లపై ప్రమాదకరమైన డ్రైవింగ్, మరణానికి కారణమైన అభియోగాలను నమోదు చేశారు. అనంతరం బెయిల్‌పై విడుదల చేశారు. పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు. దర్యాప్తులో భాగంగా ఈ ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ, డ్యాష్‌క్యామ్ లేదా ఇతర ఫుటేజ్ ఉంటే అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ALSO READ: Hyderabad : హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో అనుమానాస్పదంగా యువతి.. ఆరా తీస్తే!
ఎన్నారై సంఘాల స్పందన
ఈ విషాద ఘటనపై యూకేలోని నేషనల్ ఇండియన్ స్టూడెంట్స్ అండ్ అలుమ్ని యూనియన్ (NISAU) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. “ఈ విషాద ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులను కోల్పోవడం మాకు తీవ్ర ఆవేదన కలిగించింది. వారి కుటుంబాలకు మా ప్రగాఢ సానుభూతి” అని NISAU ప్రతినిధులు తెలిపారు. గాయపడిన విద్యార్థులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నామని వారు పేర్కొన్నారు. తెలంగాణ సంఘాలు, రాయబార కార్యాలయంతో కలిసి బాధిత కుటుంబాలకు అవసరమైన సహాయాన్ని అందిస్తున్నామని తెలిపారు.
ALSO READ: Traffic Jam : ఎంత కష్టం వచ్చింది.. హై ట్రాఫిక్ జామ్.. అంబులెన్స్ లోనే విలవిల్లాడుతూ!


