తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy)పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. ఉదయం నుంచి ఇద్దరు జర్నలిస్టులు కనపడటం లేదని.. వారిని పోలీసులు ఎక్కడ దాచారో చెప్పాలంటూ కొన్ని సోషల్ మీడియా హ్యాండిల్స్ లో పోస్టులు హల్ చల్ చేశాయి. తాజాగా ఈ కేసు వివరాలను సైబర్ క్రైమ్ అడిషనల్ సీపీ విశ్వప్రసాద్ మీడియాకు వెల్లడించారు. ‘నిప్పు కోడి’ అనే ఎక్స్ హ్యాండిల్ ద్వారా సీఎంను తిడుతున్న వీడియో వైరల్‌గా మారిందని కాంగ్రెస్ సోషల్ మీడియా రాష్ట్ర కార్యదర్శి కైలాశ్ తమకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
ఇందులో పల్స్ టీవీకి చెందిన రిపోర్టర్ గుర్తు తెలియని వ్యక్తిని ఇంటర్వ్యూ చేశారన్నారు. ఈ ఇంటర్వ్యూలో మాట్లాడిన వ్యక్తి ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని చెప్పారు. పల్స్ టీవీ ఉద్దేశపూర్వకంగా అతడితో ఈ వ్యాఖ్యలు చేయించిందని విచారణలో తేలిందని పేర్కొన్నారు. కేసు దర్యాఫ్తులో భాగంగా పల్స్ టీవీ ఛానల్ సీఈవో, జర్నలిస్టు రేవతితో పాటు ఛానల్ ప్రతినిధి సంధ్య అలియాస్ తన్వి యాదవ్‌ను అరెస్టు చేసినట్లు వివరించారు. టీవీ కార్యాలయంలో సోదాలు నిర్వహించి రెండు ల్యాప్‌టాప్‌లు, రెండు హార్డ్ డిస్క్‌లు, ఒక లోగో, ఒక రూటర్, 7 సీపీయూలు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. కాగా రేవతిపై ఇప్పటికే బంజారాహిల్స్, ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్‌లలో కేసులు నమోదైనట్లు చెప్పుకొచ్చారు.