Saturday, November 15, 2025
HomeతెలంగాణPanchayat Funds : ఏకగ్రీవ పల్లెల నిరీక్షణ - నజరానా హామీ ఏమాయె?

Panchayat Funds : ఏకగ్రీవ పల్లెల నిరీక్షణ – నజరానా హామీ ఏమాయె?

Telangana unanimous panchayat funds : గ్రామాల్లో ఎన్నికల గొడవలు వద్దని, ప్రజలంతా ఐక్యంగా ఉండి అభివృద్ధి బాటలో పయనించాలని ప్రభుత్వం ఓ గొప్ప ఆశయాన్ని ప్రకటించింది. సర్పంచి, వార్డు సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకుంటే రూ.10 లక్షల నజరానా అందిస్తామని ఊరించింది. ఆ మాటను నమ్మి, పార్టీలకతీతంగా ఏకమైన పల్లెలు ఎన్నో! కానీ, వారి పదవీకాలం ముగిసి, కొత్త ఎన్నికల నగారా మోగుతున్నా ఆ నిధుల జాడ లేదు. మరి గత హామీనే గాలికొదిలేస్తే, రాబోయే ఎన్నికల్లో ప్రజలు ప్రభుత్వాన్ని ఎలా నమ్ముతారు? అసలు ఆ నజరానా నిధుల కథ ఏమైంది?

- Advertisement -

గ్రామాలను ప్రశాంత వాతావరణంలో అభివృద్ధి పథంలో నడిపించాలన్న సదుద్దేశంతో గత ప్రభుత్వం ఏకగ్రీవ పంచాయతీలకు భారీ నజరానాలను ప్రకటించింది. సర్పంచి, వార్డు సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్న ప్రతి గ్రామ పంచాయతీకి ప్రభుత్వం తరపున రూ.10 లక్షలు, దానికి తోడుగా స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీలు తమ నియోజకవర్గ అభివృద్ధి నిధుల నుంచి మరో రూ.10 లక్షలు కేటాయిస్తామని హామీ ఇచ్చింది. అంటే, ఏకగ్రీవమైన ఒక్కో పంచాయతీకి మొత్తం రూ.20 లక్షల ప్రోత్సాహక నిధులు అందాల్సి ఉంది.

ఈ హామీతో ఎన్నో గ్రామాల్లోని ప్రజలు రాజకీయాలను పక్కనపెట్టి, ఊరి అభివృద్ధి కోసం ఏకతాటిపైకి వచ్చారు. ఉమ్మడి నల్గొండ జిల్లానే ఉదాహరణగా తీసుకుంటే, మొత్తం 1,733 గ్రామ పంచాయతీలకు గాను 237 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. ఈ లెక్కన ఒక్క జిల్లాకే రూ.23.70 కోట్లు రావాల్సి ఉంది. కానీ, ఐదేళ్ల పదవీకాలం పూర్తయినా ప్రభుత్వ ఖజానా నుంచి చిల్లిగవ్వ కూడా విడుదల కాలేదని, అటు ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా మాట నిలబెట్టుకోలేదని ఏకగ్రీవంగా ఎన్నికైన మాజీ సర్పంచులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
“ప్రభుత్వం నజరానా ఇస్తుందని నమ్మి, ఊరిలోని అన్ని పార్టీల వారిని, ప్రజలను ఒప్పించి మా పంచాయతీని ఏకగ్రీవం చేశాం. నిధులు వస్తే ఊరిలో అభివృద్ధి పనులు చేద్దామనుకున్నాం. ఐదేళ్లు ఎదురుచూశాం. మా పదవీకాలం ముగిసిపోయింది కానీ నిధులు మాత్రం రాలేదు,” అని పాటిమట్ల ఏకగ్రీవ మాజీ సర్పంచి దండెబోయిన మల్లేష్ వాపోయారు.

మరి ఈ ఎన్నికల సంగతేంటి : రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎన్నికలకు పచ్చజెండా ఊపింది. ఇప్పటికే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను రెండు దశల్లో నిర్వహించేందుకు షెడ్యూల్ ప్రకటించగా, ఆ తర్వాత గ్రామ పంచాయతీ ఎన్నికలను మూడు దశల్లో జరపనున్నారు. అయితే, రానున్న ఈ పంచాయతీ ఎన్నికలకు ఏకగ్రీవ నజరానాలపై ప్రస్తుత ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. ఒకవేళ ప్రకటించినా, గత అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజలు ఎలా స్పందిస్తారన్నది చర్చనీయాంశంగా మారింది. గత హామీని నమ్మి మోసపోయామని, ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయామని మాజీ ప్రజాప్రతినిధులు వాపోతున్నారు.

మూడు విడతల్లో స్థానిక పోరు: రాష్ట్రంలో 12,760 గ్రామ పంచాయతీలు, 1,12,534 వార్డులు, 5,763 ఎంపీటీసీలు, 565 జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల బరిలో 1,67,03,163 మంది గ్రామీణ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ స్థానిక సమరంలో తమ బలాన్ని నిరూపించుకునేందుకు అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad