Amit Shah Nizamabad Tour: తెలంగాణలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటన ఖరారైంది. రేపు అనగా ఆదివారం నిజామాబాద్‌లోని పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు. ఈమేరకు పార్టీ వర్గాలు ఆయన షెడ్యూల్ ప్రకటించాయి. అమిత్ షా ఆదివారం ఉదయం 11:25 గంటలకు అహ్మదాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి బయలుదేరి మధ్యాహ్నం ఒంటి గంటకు హైదరాబాద్ లోని బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అనతంరం మధ్యాహ్నం 1:45 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో నిజామాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వెళ్లనున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన వినాయక్‌నగర్‌లోని జాతీయ పసుపు బోర్డు కార్యాలయానికి చేరుకుంటారు.
మధ్యాహ్నం 2 గంటలకు పసుపు బోర్డు కార్యాలయాన్ని అమిత్ షా ప్రారంభించనున్నారు. 2.30 గంటల వరకు పసుపు బోర్డు కార్యాలయంలోనే ఉండనున్నారు. 2:35 గంటలకు నిజామాబాద్ కంటేశ్వర్ క్రాస్ రోడ్‌లో ఏర్పాటు చేసిన దివంగత మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. అనంతరం 2: 45 గంటల నుంచి 4 గంటల వరకు పాలిటెక్నిక్ గ్రౌండ్‌లో జరిగే కిసాన్ మహాసభలో పాల్గొంటారు. ఆ కార్యక్రమం తర్వాత సాయంత్రం 5 గంటలకు బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకుని ఢిల్లీకి తిరుగు ప్రయాణమవుతారు.
అమిత్ షా పర్యటన సందర్భంగా పోలీసులు పటిష్ట భద్రత చర్యలు చేపట్టారు. నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఇప్పటికే అమిత్ షా పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ ధర్మపురి అర్వింద్, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ పరిశీలించారు.
కాగా నిజామాబాద్‌లోని పసుపు రైతులకు జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు ప్రధాన డిమాండ్‌గా ఉంది. 2019 లోక్ సభ ఎన్నికల్లో ఈ కార్యాలయం ఏర్పాటు ప్రధాన అంశంగా లోక్ సభ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో తనను గెలిపిస్తే పసుపు బోర్డును తీసుకొస్తానని ధర్మపురి అరవింద్ హామీ ఇచ్చారు. దీంతో ఆ ఎన్నికలలో అర్వింద్ కు ప్రత్యర్థిగా ఎంపీగా పోటీ చేసిన మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె కవితను ప్రజలు ఓడించారు.
అలాగే గతేడాది జరిగిన ఎన్నికల్లోనూ అర్వింద్ ఎంపీగా గెలిచారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ జాతీయ పసుపు బోర్డు కార్యాలయం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ హామీ మేరకు నిజామాబాద్ లో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తూ కేంద్రం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అంతేకాకుండా పసుపు బోర్డు ఛైర్మన్‌గా జిల్లాకు చెందిన రైతు పల్లె గంగారెడ్డిని నియమించింది. ఈ నేపథ్యంలో పసుపు బోర్డు కార్యాలయాన్ని అమిత్ షా ప్రారంభించనున్నారు.