Rural Self-Employment For Women: “ఉపాధి హామీ పథకంలో 100 రోజుల పని పూర్తయింది. ఆ తర్వాత మా బతుకులకు భరోసా ఏంటి?” – ఇది ఎందరో గ్రామీణ కూలీల మదిని తొలిచే ప్రశ్న. రోజు కూలీపైనే ఆధారపడ్డ వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన ‘ఉన్నతి’ పథకం ఇప్పుడు ఆసరాగా నిలుస్తోంది. కేవలం కూలీలుగానే మిగిలిపోకుండా, వారిని యజమానులుగా మార్చే ఈ పథకం ఎలా పనిచేస్తుంది..? ఎలాంటి శిక్షణ ఇస్తున్నారు..? ఇది గ్రామీణ మహిళల జీవితాలను ఎలా మారుస్తోందో కరీంనగర్ జిల్లా అనుభవాల సాక్షిగా చూద్దాం…
కూలీ నుంచి యజమానిగా… ‘ఉన్నతి’ లక్ష్యం: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ (MGNREGA) పథకంలో ఒక ఆర్థిక సంవత్సరంలో 100 రోజుల పని పూర్తి చేసుకున్న కుటుంబాలే లక్ష్యంగా ‘ఉన్నతి’ పథకాన్ని ప్రారంభించారు. ఆసక్తి ఉన్నవారికి స్వయం ఉపాధి నైపుణ్యాలపై శిక్షణ ఇచ్చి, వారు సొంతంగా వ్యాపారాలు ప్రారంభించుకునేందుకు బ్యాంకుల ద్వారా ఆర్థిక తోడ్పాటు అందించడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశం. భారతీయ స్టేట్ బ్యాంకు సౌజన్యంతో గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ (RSETI) ఈ బృహత్తర కార్యక్రమాన్ని భుజానికెత్తుకుంది.
ఆత్మవిశ్వాసం నింపిన శిక్షణ: కరీంనగర్ జిల్లాలో 651 మందికి శిక్షణ ఇవ్వాలన్నది లక్ష్యం కాగా, ఇప్పటికే 544 మందికి శిక్షణ పూర్తి చేశారు.
ALSO READ:
నైపుణ్యాలు: అగర్‌బత్తీలు, కొవ్వొత్తులు, జూట్ బ్యాగుల తయారీ, కుట్టుపని, పుట్టగొడుగుల పెంపకం వంటి తక్కువ పెట్టుబడితో ఎక్కువ రాబడినిచ్చే అంశాల్లో శిక్షణ ఇస్తున్నారు.
ప్రోత్సాహకాలు: శిక్షణ కాలంలో కేవలం ఉచిత భోజన, వసతి సదుపాయాలే కాకుండా, ఉపాధి హామీ వేతనం కింద రోజుకు రూ.307 చొప్పున చెల్లిస్తున్నారు.
విస్తరణ: ఇప్పటికే జిల్లాలోని పలు మండలాల్లో శిక్షణ పూర్తి కాగా, మిగిలిన మండలాల్లోనూ త్వరలో ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు.
ALSO READ:
వారి మాటల్లోనే… మారిన జీవితాలు: “శిక్షణలో అగర్‌బత్తీల తయారీ నేర్పించారు. ముడి సరుకు సేకరణ నుంచి మార్కెటింగ్ వరకు అన్నీ చెప్పారు. ఇతర పనులు చేసుకుంటూనే, ఇంట్లోనే రోజుకు రెండు గంటలు పనిచేసి కుటుంబాన్ని పోషించుకోగలననే ఆత్మవిశ్వాసం పెరిగింది. త్వరలోనే సొంతంగా యూనిట్ పెట్టుకుంటా.”
– సుహాసిని, శిక్షణ పొందిన మహిళ.
“మాది వ్యవసాయ కూలీ కుటుంబం. ఈ శిక్షణ నాలాంటి వారికి ఎంతో మేలు చేస్తుంది. అగర్‌బత్తీలు తయారు చేయడం ద్వారా ఇంటిపట్టునే ఉంటూ రోజుకు కనీసం రూ.500 సంపాదించగలననే నమ్మకం కలిగింది.”
– ఎం.స్వరూప, శిక్షణ పొందిన మహిళ.
అధికారుల అభయం: శిక్షణ పొందిన వారికి ధ్రువపత్రాలు అందిస్తున్నామని, వారు సొంతంగా యూనిట్లు ఏర్పాటు చేసుకునేందుకు అవసరమైన పూర్తి సహకారం అందిస్తామని అదనపు పీడీ సత్యనారాయణ భరోసా ఇచ్చారు. ఈ శిక్షణ ద్వారా పొందిన ధ్రువపత్రంతో వారు సొంత వ్యాపారం పెట్టుకోవడమే కాకుండా, ఇతర సంస్థల్లోనూ ఉద్యోగ అవకాశాలు పొందవచ్చు. పని దొరకని రోజుల్లోనూ, ఇంట్లోనే ఉంటూ సంపాదించుకునే మార్గం దొరకడంతో గ్రామీణ మహిళల జీవితాల్లో ‘ఉన్నతి’ సరికొత్త వెలుగులు నింపుతోంది.


