Telangana urea shortage crisis : పొలం పిలుస్తోంది.. అదను దాటిపోతోంది.. కానీ, అన్నదాత చేతిలో బస్తా యూరియా లేదు. తెల్లవారుజామున 3 గంటలకే చెప్పులను క్యూలో పెట్టి, కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నా ప్రయోజనం శూన్యం. అసలు రాష్ట్రంలో ఈ యూరియా కొరతకు కారణమేంటి? ఇది సృష్టించిన కృత్రిమ కొరతా లేక సరఫరాలో లోపమా? ఈ సంక్షోభంపై ప్రభుత్వం చెబుతున్నదేంటి..?
తెల్లవారకముందే పడిగాపులు : రాష్ట్రవ్యాప్తంగా యూరియా కోసం రైతులు పడుతున్న అరిగోస వర్ణనాతీతం. సాగు పనులకు అత్యంత కీలకమైన ఈ దశలో, ఎరువుల దుకాణాల ముందు రాత్రి పగలు తేడా లేకుండా నిరీక్షిస్తున్నారు.
మహబూబ్‌నగర్ జిల్లాలో తెల్లవారుజామున 4 గంటల నుంచే రైతులు తమ చెప్పులను వరుసలో పెట్టి గంటల తరబడి పడిగాపులు కాశారు. నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి, వరంగల్ జిల్లా నర్సంపేట సహకార సంఘాల వద్ద రైతులు, మహిళా రైతులు పెద్ద ఎత్తున బారులు తీరారు. మహబూబాబాద్ జిల్లా కురవిలో టోకెన్ల కోసం రైతులు గోడలు దూకి పరుగులు తీశారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.
“పంట వేసిన 20 రోజుల్లోపు యూరియా చల్లితేనే దిగుబడి వస్తుంది. ఇప్పుడు అదను దాటిపోతోంది. సమయానికి ఎరువు అందకపోతే మా బతుకులు ఆగమైపోతాయి” అని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఆందోళనల బాటలో అన్నదాత : ఓ వైపు ప్రకృతి కరుణించక, మరోవైపు ప్రభుత్వాలు పట్టించుకోక అన్నదాతలు రోడ్డెక్కుతున్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్‌లో రైతులు ధర్నాకు దిగారు. రామాయంపేట, చిట్కుల్ చౌరస్తాలలో బీజేపీ, బీఆర్ఎస్ శ్రేణులు వేర్వేరుగా ఆందోళనలు చేపట్టాయి. మరిపెడలో రైతులు ఏకంగా వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై బైఠాయించి తమ నిరసనను తెలియజేశారు.
ఇదే అదనుగా కొన్ని ప్రైవేటు దుకాణాల యజమానులు యూరియా బస్తా కావాలంటే ఇతర పురుగుల మందులు కొనాల్సిందేనని లంకె పెడుతున్నారని, కొరతను ఆసరాగా చేసుకుని దోపిడీకి పాల్పడుతున్నారని రైతులు ఆరోపిస్తున్నారు.
కేంద్రంతో పోరాడతాం: మంత్రి తుమ్మల : రైతుల ఆందోళనలు, విపక్షాల విమర్శల నేపథ్యంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పందించారు. హైదరాబాద్ నుంచి జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన, యూరియా కొరతపై ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడ్డారు.
“రైతులను అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేస్తే ఊరుకునేది లేదు. అధికారం పోయిందన్న ఆవేదనతో బీఆర్ఎస్, రైతుల గురించి మాట్లాడే హక్కు లేని బీజేపీ విమర్శలు చేయడం హాస్యాస్పదం. రైతులు అధైర్యపడొద్దు. మీ అవసరాలు తీర్చడం మా బాధ్యత. అవసరమైతే కేంద్రంతో పోరాడి అయినా సరే, రాష్ట్రానికి అవసరమైన యూరియాను తెప్పిస్తాం” అని మంత్రి భరోసా ఇచ్చారు. ఈ క్లిష్ట సమయంలో అధికారులందరూ రైతులకు అండగా నిలవాలని ఆయన ఆదేశించారు.


