Trump Tariffs-Telangana Textile Industry:అమెరికా విధించిన కొత్త సుంకాలు తెలంగాణ రాష్ట్రంలోని చేనేత, జౌళి, హస్తకళల రంగాలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. గత ఆగస్టు 7 నుండి అమెరికా ప్రభుత్వం భారత్ నుంచి దిగుమతి అయ్యే ఉత్పత్తులపై 50 శాతం సుంకాన్ని అమలు చేయడంతో, రెండు నెలల్లోనే తెలంగాణ ఉత్పత్తుల ఆర్డర్లు గణనీయంగా తగ్గిపోయాయి. ఈ మార్పు స్థానిక పరిశ్రమలకు పెద్ద దెబ్బగా మారింది.
పెద్ద, మధ్యతరహా, చిన్న పరిశ్రమలు…
రాష్ట్రంలో జౌళి రంగం ప్రధానంగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా చుట్టుపక్కల ప్రాంతాల్లో విస్తరించింది. కరీంనగర్, నల్గొండ, వరంగల్, మహబూబ్‌నగర్ జిల్లాల్లోనూ అనేక పెద్ద, మధ్యతరహా, చిన్న పరిశ్రమలు ఉన్నాయి. వీటిలో పురుషుల, మహిళల, పిల్లల దుస్తులతో పాటు వివిధ వస్త్ర ఉత్పత్తులు తయారు అవుతుంటాయి. సాధారణంగా తెలంగాణ నుంచి అమెరికాకు సంవత్సరానికి సుమారు రూ.150 కోట్ల విలువైన జౌళి ఉత్పత్తులు ఎగుమతి అవుతుంటాయి.
Also Read: https://teluguprabha.net/devotional-news/vastu-rules-to-follow-on-diwali-for-prosperity-and-luck/
ట్రంప్ సుంకాలు అమలులోకి..
అమెరికా కంపెనీలు నేరుగా ఇవ్వడమే కాకుండా, ముంబయి, ఢిల్లీ, అహ్మదాబాద్‌ల్లో ఉన్న సంస్థల ద్వారా కూడా ఆర్డర్లు వస్తాయి. కానీ ట్రంప్ సుంకాలు అమలులోకి వచ్చిన తర్వాత ఈ ఆర్డర్లు ఒక్కసారిగా తగ్గాయి. దీనివల్ల అమెరికా మార్కెట్‌పై ఆధారపడి పనిచేసే కంపెనీలు ఉత్పత్తిని తగ్గించక తప్పలేదు. అమెరికా మాత్రమే కాక, ఇతర దేశాలూ ఇప్పుడు దిగుమతులపై కొత్త ఆలోచనల్లో పడటంతో, అంతర్జాతీయ డిమాండ్ కూడా తగ్గుముఖం పట్టింది.
బంగ్లాదేశ్, వియత్నాం…
పరిశ్రమల యజమానులు చెబుతున్నదాని ప్రకారం, బంగ్లాదేశ్, వియత్నాం వంటి దేశాల నుంచి వస్త్రాలు తక్కువ ధరలకు లభిస్తున్నందున, అమెరికా సంస్థలు భారత ఉత్పత్తులను తగ్గించి ఆ దిశగా మళ్లుతున్నాయి. దీనివల్ల తెలంగాణ ఉత్పత్తులపై ఆర్డర్లు మరింతగా తగ్గాయి. సిరిసిల్లలో ఉన్న అనేక వస్త్ర యూనిట్లు ఇప్పటివరకు గుజరాత్, మహారాష్ట్ర కంపెనీలకు వస్త్రాలు సరఫరా చేసేవి. ఇప్పుడు ఆ రాష్ట్రాల కంపెనీలూ తమ ఆర్డర్లను తగ్గించడంతో అక్కడి యజమానులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
చేనేత, జౌళి, హస్తకళల రంగాల్లో…
ఎగుమతుల తగ్గుదల కార్మికుల ఉపాధిపై కూడా గట్టి ప్రభావం చూపుతోంది. రాష్ట్రంలో చేనేత, జౌళి, హస్తకళల రంగాల్లో సుమారు 75 వేల మంది ఉపాధి పొందుతుంటే, గత రెండు నెలల్లో అందులో దాదాపు 20 వేల మందికి స్థిరమైన ఉపాధి దొరకడం లేదు. రోజువారీ కూలీలకూ పనులు తగ్గిపోవడంతో కుటుంబాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.
Also Read: https://teluguprabha.net/devotional-news/vastu-secrets-of-salt-and-its-impact-on-home-harmony/
తెలంగాణాలో చేనేత ఉత్పత్తులు దేశవ్యాప్తంగా ప్రసిద్ధి పొందాయి. పోచంపల్లి, సిద్దిపేట, గద్వాల, వరంగల్ ప్రాంతాల్లో నేసే చీరలు అమెరికా మార్కెట్‌లోనూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాయి. సంవత్సరానికి దాదాపు రూ.42 కోట్ల విలువైన చీరలు అమెరికాకు వెళ్ళేవి. కానీ ఇప్పుడు ఆ ఎగుమతులు దాదాపుగా నిలిచిపోయాయి. లినెన్ చీరలు తయారు చేసే వ్యాపారులు చెబుతున్నదాని ప్రకారం, గత రెండు నెలలుగా పది చీరలకూ ఆర్డర్ రాలేదని తెలిపారు.
ఇత్తడి విగ్రహాలు…
అదే విధంగా హస్తకళల రంగం కూడా తీవ్రమైన దెబ్బ తిన్నది. పెంబర్తిలో తయారు చేసే ఇత్తడి విగ్రహాలు, కరీంనగర్ ఫిలిగ్రీ కళారూపాలు, నిర్మల్ బొమ్మలు, ఆదిలాబాద్ డోక్రా కళాకృతులు అమెరికా, యూరప్, ఆస్ట్రేలియా వంటి దేశాలకు ఎగుమతి అవుతుంటాయి. ఈ ఉత్పత్తుల ద్వారా సంవత్సరానికి సుమారు రూ.52 కోట్ల ఆదాయం వచ్చేది. అమెరికాలోని ప్రవాస భారతీయులు వీటిని కార్గో ద్వారా దిగుమతి చేసుకునేవారు. ఇప్పుడు ఆర్డర్లు లేకపోవడంతో ఆ కళాకారులు కూడా ఆర్థిక కష్టాల్లో ఉన్నారు.
పలువురు పరిశ్రమ యజమానులు ప్రభుత్వం నుండి తక్షణ సాయం కోరుతున్నారు. కేఆర్డీ టెక్స్‌టైల్స్ యజమాని చరణ్ రెడ్డి మాట్లాడుతూ, అమెరికా సుంకాల ప్రభావంతో అనేక టెక్స్‌టైల్ యూనిట్లు ఇప్పటికే మూతపడ్డాయని చెప్పారు. తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల్లో ఉన్న కంపెనీలకు కూడా వస్త్రాలను సరఫరా చేసే అవకాశాలను పరిశీలిస్తున్నామన్నారు. కానీ దేశీయ మార్కెట్‌లో డిమాండ్ పెరగడానికి ప్రభుత్వ ప్రోత్సాహం అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.


