కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ రాజ్యసభ సభ్యులు వి.హనుమంతరావు(V. Hanumantha Rao) నివాసంలో మున్నూరు కాపు నేతల(Munnuru Kapu leaders) సమావేశం ఏఐసీసీ ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ అంశంపై వీహెచ్ స్పందించారు. దీనిపై ఒకరిద్దరికి కోపం రావచ్చని తెలిపారు. ఆ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డిని కానీ.. ప్రభుత్వాన్ని కానీ ఎవరు తిట్టలేదని చెప్పారు. మున్నూరు కాపుల జనాభా లెక్క కొంచెం తక్కువ ఉందని అభిప్రాయపడ్డారని పేర్కొన్నారు. దీనిపై సీఎంతోనే మాట్లాడతామని.. ఆయనతో మాట్లాడిన తర్వాత మున్నూరు కాపు సభ తేదీ ఖరారు చేస్తామని వెల్లడించారు.
కాగా వీహెచ్ నివాసంలో జరిగిన ఈ సమావేశానికి కాంగ్రెస్ నేతలతో పాటు బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు చెందిన పలువురు నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో మున్నూరు కాపు నేతలకు ప్రాధాన్యత ఇవ్వడం లేదంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే మంత్రివర్గంలోనూ చోటు కల్పించలేదని వాపోయారు. ఈ సమావేశంపై కాంగ్రెస్ అధిష్టానం(AICC) సీరియస్ అయింది. ఈ భేటీపై నూతన కాంగ్రెస్ ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షతన జరగాల్సిన సమావేశానిక ప్రతిపక్ష నేతలను ఆహ్వానించి ప్రభుత్వాన్ని విమర్శించడం ఏమిటని ప్రశ్నించారు. బీసీ కులగణనతో ప్రభుత్వాన్ని అభినందించాల్సింది పోయి విమర్శించడం సరికాదని అభిప్రాయపడ్డారు.