ఓవైపు సరిహద్దుల్లో పాకిస్థాన్‌తో భారత ఆర్మీ తీవ్రంగా పోరాడుతుంటే.. మరోవైపు సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఆర్మీ అధికారులమంటూ ప్రజలకు సందేశాలు పంపుతూ విరాళాల పేరుతో అందినకాడికి దోచుకుంటున్నారు. ఇలాంటి నకిలీ ఆర్మీ అధికారుల పట్ల అప్రమత్తంగా ఉండాలని టీజీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్(VC Sajjanar) హెచ్చరించారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.
“సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో సైబర్ నేరగాళ్లు కొత్త దందాకు తెరలేపారు. ఆర్మీ అధికారులమంటూ సందేశాలు పంపుతూ.. అందిన కాడికి దండుకుంటున్నారు. ఇలాంటి నకిలీ ఆర్మీ అధికారుల పట్ల జాగ్రత్తగా ఉండండి. డొనేషన్ సందేశాలను నమ్మి డబ్బు చెల్లిచకండి. ఎవరైనా ఆర్మీ అధికారి పేరుతో డొనేషన్ అడిగితే ఎలాంటి డబ్బులు చెల్లించవద్దు. ఒకవేళ అనుమానాస్పద సందేశాలు వస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి” అని సూచించారు.