Saturday, November 15, 2025
HomeతెలంగాణMonsoon Motoring: : వానాకాలంలో ప్రయాణం.. ఈ జాగ్రత్తలు పాటిస్తేనే క్షేమం!

Monsoon Motoring: : వానాకాలంలో ప్రయాణం.. ఈ జాగ్రత్తలు పాటిస్తేనే క్షేమం!

Safe driving tips during monsoon : ఆహా, వానొస్తే ఎంత బాగుంటుంది! వేడికి చల్లని ఉపశమనం, పచ్చదనం పరిచే ప్రకృతి… కానీ, అదే వాన రోడ్డుపై ప్రయాణించేటప్పుడు ప్రాణాలకు ముప్పుగా మారుతుందని మీకు తెలుసా? చిటపట చినుకుల సంగీతం, కొన్నిసార్లు ఆర్తనాదాలుగా మారవచ్చు. వానాకాలంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య గణనీయంగా పెరగడానికి కారణం కేవలం మన నిర్లక్ష్యమే కాదు, దాని వెనుక కొన్ని శాస్త్రీయ కారణాలు కూడా ఉన్నాయి. ఇంతకీ, వర్షం పడినప్పుడు మన వాహనం టైర్లకు, రోడ్డుకు మధ్య ఏం జరుగుతుంది..? ప్రాణాలను హరించే ఆ ‘హైడ్రోప్లేనింగ్’ అంటే ఏమిటి..? ఈ వానాకాలంలో మన ప్రయాణం సురక్షితంగా, ఆనందంగా సాగాలంటే ఎలాంటి మెలకువలు పాటించాలి..?

- Advertisement -

“వర్షాకాలంలో ప్రయాణం చేసేటప్పుడు కొద్దిపాటి జాగ్రత్తలు, మెలకువలు పాటిస్తే ప్రమాదాలను నివారించి, సురక్షితంగా గమ్యం చేరవచ్చు,” అని ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఉప రవాణా కమిషనర్ పురుషోత్తం సూచిస్తున్నారు.

ప్రమాదాలకు ప్రధాన కారణం ‘హైడ్రోప్లేనింగ్’: వానాకాలంలో జరిగే అనేక ప్రమాదాలకు మూల కారణం ‘హైడ్రోప్లేనింగ్’ (Hydroplaning) అనే శాస్త్రీయ దృగ్విషయం.

ఏమిటిది : వర్షం పడినప్పుడు, రోడ్డుపై ఉన్న నీటి పొరపై మన వాహనం టైర్లు పట్టు కోల్పోయి, నియంత్రణ లేకుండా తేలియాడటాన్ని హైడ్రోప్లేనింగ్ అంటారు.

ఎలా జరుగుతుంది : సాధారణంగా, టైర్లపై ఉన్న గాడులు నీటిని పక్కకు నెట్టివేసి, రోడ్డుతో పట్టు ఉండేలా చేస్తాయి. కానీ, వాహనం వేగం పెరిగే కొద్దీ, లేదా టైర్లు అరిగిపోయినప్పుడు, ఈ గాడులు సరిగా పనిచేయవు. ఫలితంగా, టైరుకు, రోడ్డుకు మధ్య ఒక నీటి పొర ఏర్పడి, వాహనం అదుపు తప్పుతుంది. ఈ సమయంలో సడన్‌గా బ్రేక్ వేస్తే, వాహనం స్కిడ్ అయి బోల్తా పడే ప్రమాదం చాలా ఎక్కువ.

నివారణ: తడి రోడ్లపై వాహనాలను నెమ్మదిగా నడపడం, సడన్ బ్రేకులు వేయకపోవడం, స్టీరింగ్‌ను నిశ్చలంగా ఉంచడం ద్వారా హైడ్రోప్లేనింగ్ ప్రమాదాల నుంచి బయటపడవచ్చు.

పాటించాల్సిన మరిన్ని జాగ్రత్తలు..
వాహనం కండిషన్: ప్రయాణానికి ముందే మీ వాహనాన్ని (కారు లేదా బైక్) ఒకసారి క్షుణ్ణంగా తనిఖీ చేసుకోండి. టైర్లలో గాలి సరిగ్గా ఉందా, వైపర్లు, బ్రేకులు, హెడ్‌లైట్లు సక్రమంగా పనిచేస్తున్నాయా లేదా అని నిర్ధారించుకోండి.

తగ్గించండి వేగం: వర్షంలో వేగం అత్యంత ప్రమాదకరం. మామూలు సమయం కంటే వేగాన్ని తగ్గించి, నెమ్మదిగా ప్రయాణించడం శ్రేయస్కరం.

గుంతలతో గండం: వర్షాకాలంలో రోడ్లపై గుంతలు కనిపించకుండా నీటితో నిండి ఉంటాయి. ఇవి మృత్యుకుపాల్లాంటివి. నీరు నిలిచిన చోట వేగంగా వెళ్లొద్దు. వీలైనంత వరకు వాటిని తప్పించి, పక్క నుంచి వెళ్లడం మంచిది.

రేడియం స్టిక్కర్లు: వాహనాలకు రేడియం స్టిక్కర్లను తప్పనిసరిగా అతికించుకోవాలి. ఇవి చీకటిలో, వర్షంలో ఎదుటి వాహనాలకు మీ ఉనికిని తెలియజేసి, ప్రమాదాలను నివారిస్తాయి.

హెల్మెట్ తప్పనిసరి: ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా నాణ్యమైన హెల్మెట్ ధరించాలి, దాని స్ట్రిప్‌ను సరిగ్గా లాక్ చేసుకోవాలి. ఈ చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే, ఈ వానాకాలంలో మీ ప్రయాణాన్ని ఆనందంగా, సురక్షితంగా మార్చుకోవచ్చు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad