కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 గ్యారంటీలో గృహజ్యోతి పథకాల అమలులో భాగంగా 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ తెలంగాణ రాష్ట్రంలో అమలుపరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో చేవెళ్లలో ఫిబ్రవరి 27న జరగనున్న సీఎం సభకు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల సన్నాహాక సమావేశం జరిగింది.
ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు హాజరయ్యారు. సమావేశంలో వారు మాట్లాడుతూ… చేవెళ్ల మండల కేంద్రంలోని ఫరా ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో 27 మంగళవారం ప్రియాంక గాంధీ చేతుల మీదగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీ పథకాల అమలులో భాగంగా మరో రెండు ప్రధానమైన హామీలను అమలు చేస్తారన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నేతృత్వంలో మిగతా రెండు హామీలు త్వరలో నెరవేరుస్తామన్నారు.
రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ పార్టీపై భరోసా ఉందని ప్రజల ప్రభుత్వంగా పార్టీ పనిచేస్తుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో నాయకులు కార్యకర్తలు కష్టపడితే మరో 20 సంవత్సరాలు ప్రజలు ఆదరిస్తారని పార్టీకి ఢోకా ఉండదన్నారు. ప్రతిపక్షాలకు బురదజల్లడమే పనిగా పెట్టుకుందన్నారు. ఏడాది వరకు కాంగ్రెస్ పాలనను ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదని ప్రతిపక్షాల టీవీ పత్రికలలో వచ్చే అవాస్తవాలను ఎప్పటికప్పుడే తిప్పి కొట్టాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ సభకు అన్ని పార్టీలకు పిలుపునిస్తున్నామని ఈ ప్రజాపాలనలో అందరు హాజరవ్వాలన్నారు. సభకు చేవెళ్ల పార్లమెంటు స్థాయి నాయకులు కార్యకర్తలు భారీ జన సమీకరణ చేసి సభ సక్సెస్ చేయాలని సూచించారు. అనంతరం సభ స్థలాన్ని వారు పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి పరిగి తాండూర్ ఎమ్మెల్యేలు రామ్మోహన్ రెడ్డి, మనోహర్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ సునీత మహేందర్ రెడ్డి, నియోజకవర్గ ఇన్చార్జ్ ఫామెన భీమ్ భరత్, పంచాయతీ రాజ్ సంఘటన్ ఆల్ ఇండియా జనరల్ సెక్రెటరీ కిరణ్, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు చల్ల నరసింహారెడ్డి, పిసిసి జనరల్ సెక్రెటరీ జ్యోత్స్న, సొసైటీ చైర్మన్లు దేవర వెంకటరెడ్డి, గోనె ప్రతాపరెడ్డి, చేవెళ్ల మాజీ సర్పంచ్ శైలజ ఆగిరెడ్డి, చేవెళ్ల పార్లమెంట్ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.