బంజారాల జనాభా అధికంగా ఉన్న రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్, ఛత్తీస్ గడ్ వంటి రాష్ట్రాలలో సైతం తెలంగాణాలో గిరిజనుల అభివృద్ధి కోసం అమలవుతున్న కార్యక్రమాలు కానరావన్నారు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. బాల్కొండ నియోజకవర్గం భీంగల్ మండల కేంద్రంలో గిరిజనుల ఆరాధ్యదైవం శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ 284 జయంతి ముగింపు ఉత్సవాలను అధికారికంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుతో కలిసి మంత్రి వేముల పాల్గొన్నారు. 50 లక్షల నిధులతో నూతనంగా నిర్మించిన బంజారా భవన్ కు ప్రారంభోత్సవం చేశారు.
18 వ శతాబ్దంలోనే అనేక ఆంక్షలతో కూడిన నాటి సమాజంలోనూ ఎన్నో అవరోధాలను అధిగమిస్తూ సేవాలాల్ మహారాజ్ సంఘ సంస్కర్తగా పని చేశారని మంత్రి గుర్తుచేశారు. ఆయన పరమపదించి దాదాపు రెండు వందల సంవత్సరాలు దాటినా కూడా సేవాలాల్ మహారాజ్ ను దైవంగా భావిస్తున్నారంటే ఆయన చేసిన బోధనలు, అనుసరించిన మార్గం ఎంత గొప్పదో అర్ధం చేసుకోవచ్చని కలెక్టర్ పేర్కొన్నారు.