నకిరేకల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వేముల వీరేశం (Vemula Veeresham) కేటీఆర్ పై సంచలన ఆరోపణలు చేశారు. గతంలో ఫోన్ ట్యాపింగ్ చేసింది, చేయించింది కేటీఆరేనంటూ బాంబు పేల్చారు. లగచర్ల ఘటనపై మీడియాతో మాట్లాడిన ఆయన గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై, కేటీఆర్ పై పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు. ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి.
గతంలో కేటీఆర్ ఎన్నో చీకటి పాపాలు చేశారన్నారు వేముల వీరేశం (Vemula Veeresham). ఆయన పాపాలు బయటకు వస్తే తెలంగాణ లో ఐదు నిమిషాలు కూడా ఉండలేడని విమర్శించారు. నల్గొండ జిల్లా డీటీసీ లో 1300 మంది దళితుల్ని కేటీఆర్, జగదీష్ రెడ్డి ఆదేశాలతో చిత్రహింసలకు గురిచేశారని చెప్పారు. తాను కాంగ్రెస్ లో చేరుతున్నప్పుడు కేటీఆర్ బెదిరించారని వేముల వెల్లడించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న ప్రభాకర్ రావు తన టేబుల్ పైన వెపన్ పెట్టి పార్టీ మారొద్దని, దళితుడైన తనని బెదిరించారని వేముల చెప్పుకొచ్చారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్ అసలు సూత్రధారి అని వేముల చెప్పుకొచ్చారు. చిరుమర్తి లింగయ్య కాదు కేటీఆరే దొంగచాటుగా ఫోన్ సంభాషణలు విన్నాడని ఆరోపించారు.
Vemula Veeresham : అభివృద్ధిని అడ్డుకోడానికి కేటీఆర్ కుట్రలు’
కొడంగల్ లో దళిత, గిరిజన, బీసీ బిడ్డల జీవితాల్లో వెలుగులు నింపడానికి ,ఉపాధి కల్పనకు ప్రభుత్వం భూసేకరణ జరుపుతోందని వేముల వీరేశం తెలిపారు. పరిశ్రమలు వస్తే తెలంగాణ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందనే అక్కసుతో కేటీఆర్ వ్యవహరిస్తున్నాడని ధ్వజమెత్తారు. కేటీఆర్ కుట్రతో అభివృద్దిని అడ్డుకోవడానికి నీచాతి నీచంగా వ్యవహరిస్తున్నారు.. అధికారులను అంతమొందించే కుట్ర చేశారని వీరేశం మండిపడ్డారు.
“మల్లన్న సాగర్ కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం 12 గ్రామాల ప్రజలను బెదిరించి, దౌర్జన్యం చేసి భూసేకరణ చేసింది. వెయ్యి ఎలుకలను తిన్న పిల్లి తీర్థయాత్రలకు పోయినట్టు గా కేటీఆర్ తీరు ఉంది. 10 యేళ్లు రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ బీఆర్ఎస్ అమలు చేసింది. తెలంగాణ సమాజం ఎప్పటికీ బీఆర్ఎస్ పార్టీని క్షమించదు. పాపాలు, దుర్మార్గాలు చేసి కేటీఆర్ ఇప్పుడు సుద్దపూస లా మాట్లాడుతున్నాడు. కేటీఆర్ కారణంగా బీఆర్ఎస్ నామరూపాలు లేకుండా పోతుందని వీరేశం విమర్శించారు. లగచర్ల దాడిలో కేటీఆర్ పాత్రపై పూర్తి విచారణ జరపాలి, ఆయన పాత్ర ఉంటే వెంటనే అరెస్ట్ చేయాలి అని వీరేశం డిమాండ్ చేశారు.