వేములవాడలో మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికకు గడువు సమీపిస్తున్న కొద్ది స్థానిక రాజకీయాలు హీటెక్కుతున్నాయి. నిన్నటికి నిన్న బి.ఆర్.ఎస్ పార్టీ కౌన్సిలర్లు క్యాంప్ కు వెళ్లిన సంగతి మర్చిపోకముందే భారతీయ జనతా పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. వేములవాడ పట్టణ 15వ వార్డు కౌన్సిలర్ తిరుమల్ రెడ్డి కవిత- సుమంత్ రెడ్డి బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణకు రాజీనామా పత్రాన్ని పంపించారు. అనివార్య కారణాల వల్ల పార్టీకి రాజీనామా చేస్తున్నామని లేఖలో పేర్కొన్నారు. ఇదిలా ఉండగా భవిష్యత్తు కార్యాచరణపై ఇంకా ఏమీ ఆలోచించ లేదని, త్వరలోనే తమ నిర్ణయం వెల్లడిస్తామని కౌన్సిలర్ కవిత-సుమంత్ రెడ్డి తెలిపారు.