రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గంలో రాజకీయాలు రోజు రోజుకు మలుపు తిరుగుతున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు పార్టీ కేడర్ ను పట్టించుకోవడం లేదని, తమను చిన్నచూపు చూస్తున్నారని చాలామంది లీడర్లు చెన్నమనేని వర్గీయులు, చెన్నమనేనితో పదవులు పొందిన నాయకులు కూడా ఆరోపిస్తూ, చెల్మెడ లక్ష్మి నరసింహ రావు గూటికి చేరిపోయారు. వేములవాడ టికెట్ ఆశిస్తున్న చెల్మెడా లక్ష్మీనరసింహారావు, చేన్నమనేని వ్యతిరేక దారులను, రాజకీయాల్లో తటస్థంగా ఉన్న నాయకులను ఏకతాటి పైకి తెచ్చేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాడు. అదే క్రమంలో సొంత మండలంలోని మల్కపేట గ్రామంలో పార్టీ యువజన సమ్మేళనం పేరుతో సమావేశం ఏర్పాటు చేయడంతో రాజకీయాలు మరింత రసవత్తరంగా మారాయి.
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అహర్నిశలు కష్టపడి పనిచేసిన కార్యకర్తలను, నాయకులను పార్టీ కేడర్ పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం చాలా బాధాకరమని, నాకు అవకాశం ఇస్తే పార్టీ కార్యకర్తలను కడుపులో పెట్టి చూసుకుంటానని చెల్మెడ లక్ష్మీనరసింహారావు తెలపడం అసమ్మతి వాదుల్లో హర్షాన్ని నింపాయి. పార్టీలో రోజురోజుకు అసమ్మతి, వ్యతిరేక భావాలు పెరిగిపోతుండడంతో పార్టీ రెండు ముక్కలు కాకుండా ఉండటం కోసమే ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చినట్టు చెప్పడం చర్చనీయాంశంగా మారింది. టికెట్ ఎవరికీ ఇచ్చిన పని చేస్తామని చెబుతూనే చల్మెడ వర్గం రమేష్ బాబుకు వ్యతిరేకంగా పావులు కదపడం రాజకీయ చర్చకు దారితీస్తుంది. కొంత మంది ఉన్నత పదవులు అనుభవిస్తున్న నాయకుల తీరుతో పార్టీ రెండు ముక్కలుగా విడిపోతుందని కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. వేములవాడ ఎమ్మెల్యే రమేష్ బాబుపై వ్యతిరేకతతో ఉన్నటువంటి అసమ్మతి నాయకులకు, సమ్మతి నాయకులకు సరైన నాయకుడు ఎవరో తెలుసుకోలేక సతమతంలో మునిగిపోతున్నారు.సిట్టింగ్ ఎమ్మెల్యేలకే టికెట్ వస్తుందన్న ఆశతో ఎమ్మెల్యే రమేష్ బాబు అధిష్టానం నిర్ణయంకోసం వేచి చూస్తున్నాడు.
కొనరావుపేటలోనే వ్యతిరేకతకు బీజం
వేములవాడ నియోజకవర్గంలో అన్ని మండలాలతో పోలిస్తే కొనరావుపేట మండలంలో తమకు నమ్మిన బంటుగా ఉన్న నాయకులకు అత్యున్నత పదవులు కట్టబెట్టారు. కానీ అలాంటి కోనరావుపేటలోనే తీవ్రమైన వ్యతిరేకం ఏర్పడింది. వారు కోరుకున్న పదవులను కట్టబెట్టినప్పటికీ ఎమ్మెల్యే రమేష్ కు వ్యతిరేకులుగా ఎందుకు తయారయ్యారో ఎవ్వరికి అర్థం కావడం లేదు. ఎలాంటి వివాదాలకు తావు లేకుండా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ప్రజల మన్ననలను పొందినటువంటి నాయకుడికి నమ్మిన బంటులే వెన్నుపోటు పొడవడం బాధాకరం. వేములవాడ నియోజకవర్గంగా ఆవిర్బవించినప్పటి నుండి చేన్నమనేని వంశమే ఎమ్మెల్యేగా కొనసాగుతుంది. ప్రస్తుత పరిస్థితి చుస్తే వెన్నుపోటు దారులతో పరాయి చేతులోకి వెళ్లిపోతుందా అనే చర్చ జరుగుతోంది.