వేములవాడ నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చల్మెడ లక్ష్మీనరసింహారావు స్వగ్రామమైన కోనరావుపేట మండలం మల్కపేటలో లక్ష్మీనరసింహారావు సతీమణి సునీల ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, మహిళ సోదరీమణులతో కలిసి ఇంటింటికి వెళ్లిన ఆమె మహిళలకు బొట్టు పెట్టి, బిఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోను, ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరిస్తూ, మళ్ళీ ఒకసారి కారు గుర్తుపై ఓటు వేయాలని, సీఎం కేసీఆర్ ను మూడోసారి ముఖ్యమంత్రిని చేసుకోవాలని సూచించారు. అట్లాగే ఈ గ్రామ బిడ్డగా సేవ చేయాలనే లక్ష్యంతో, అభివృద్ధి చేయాలనే ఆశయంతో ముందుకు వస్తున్న లక్ష్మీ నరసింహారావును భారీ మెజారిటీతో గెలిపించాలని, ఆయన గెలుపు మన ఊరికి ఎంతో గర్వకారణంగా ఉంటుందని అన్నారు. ఈ గ్రామ బిడ్డగా లక్ష్మీ నరసింహారావు గ్రామంలో ఇప్పటికే ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాడని, ఎంతోమందిని ఆపదలో ఆదుకున్నాడని అన్నారు. ఈ మధ్యకాలంలోనే సొంత ఖర్చుతో అత్యాధునిక హంగులతో పాఠశాల నిర్మాణం జరిగిందని, గుట్టపై రామాలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టారని, రాబోయే రోజుల్లో మరిన్ని అభివృద్ధి పనులు చేసేందుకు సిద్ధంగా ఉన్నారని, అందుకే లక్ష్మీ నరసింహారావుకు ఒక్కసారి అవకాశం ఇచ్చి, ఆశీర్వదిస్తే ఈ గ్రామంతో పాటు నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఇదిలా ఉండగా ప్రచారంలో భాగంగా గ్రామానికి వెళ్లిన సునీలకు అడుగడుగునా గ్రామస్తులు జననీరాజనాలు పలికారు. గ్రామస్తుల ఆప్యాయతతో ఆమె వెంట వున్న మహిళామనులతో కార్తీక శోభ సంతరించుకుంది. వారి వెంట గ్రామ సర్పంచ్ ఆరె లత-మహేందర్,ఎంపీపీ చంద్రయ్య గౌడ్, బి.ఆర్.ఎస్ పార్టీ మహిళ విభాగం మండల అధ్యక్షురాలు చీటి సంధ్య, ఉప సర్పంచ్, పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడితో పాటు స్థానిక యువకులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.