Vemulawada RajarajeshwaraSwamy Temple: దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయ విస్తరణలో భాగంగా.. భక్తులకు స్వామివారి దర్శనాన్ని నిలిపివేశారు. దీంతో స్వామి వారిని దర్శించుకోవడానికి సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ఆందోళనకు దిగారు. ముందస్తు ప్రకటన లేకుండా దర్శనాలు నిలిపివేయడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎల్ఈడీ స్క్రీన్ ఏర్పాటు: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి పనుల నేపథ్యంలో.. భక్తులు ఆలయంలోకి ప్రవేశించకుండా ముందు భాగంలోని ప్రధాన గేటు వద్ద ఇనుప రేకులను అధికారులు అమర్చారు. భక్తులు లోనికి రాకుండా ఇప్పటికే ఆలయం చుట్టుపక్కల సైతం ఇనుప రేకులు అమర్చారు. భక్తుల దర్శనాల నిమిత్తం ఆలయం ముందు భాగంలో స్వామివారి ప్రచార రథం వద్ద ఎల్ఈడి స్క్రీన్‌ను ఆలయ అధికారులు ఏర్పాటు చేశారు.అయితే ఆలయ అధికారులు ముందస్తు ప్రకటన లేకుండా దర్శనాలు నిలిపివేయడంతో భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎంతో దూరం నుంచి వచ్చి స్వామివారికి మొక్కు చెల్లిందమని వస్తే ఆలయ అధికారులు ఇలా చేయడం భావ్యం కాదని భక్తులు అధికారుల తీరుపై మండిపడుతున్నారు. ఇంత చలిలోనూ స్వామివారి దర్శనం కోసం ప్రధాన గేటు వద్ద వేచి చూస్తున్నామని తెలిపారు. అయినా అధికారులు కనికరించడం లేదని భక్తులు ఆందోళన వ్యక్తం చేశారు.
భీమేశ్వరాలయంలో దర్శనాలు: అలాగే భక్తుల సౌకర్యార్థం భీమేశ్వరాలయంలో స్వామివారి దర్శనంతో పాటు కోడె మొక్కలు వంటి సేవలను ఇప్పటికే ప్రారంభించారు. అభివృద్ధి పనుల్లో భాగంగా సుమారు నెల రోజుల నుంచి ఆలయ పరిసరాలలో కూల్చివేతలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. దక్షిణం, ఉత్తర భాగాలలో ప్రాకారం.. పడమర వైపు ఉన్న నైవేద్యశాల, ఆలయ ఈవో కార్యాలయం ఇప్పటికే తొలగించామని అన్నారు. ఈ క్రమంలో తాజాగా బుధవారం తెల్లవారుజామున మెయిన్ గేట్‌ను ఇనుప రేకులతో మూసివేసినట్లుగా తెలిపారు. అయితే దేవాదాయశాఖ కమిషనర్, ఆలయ అధికారులు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఆలయాన్ని మూసి వేయడంపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


