Lagacharla| వికారాబాద్(Vikarabad) జిల్లా లగచర్లలో కలెక్టర్, అధికారులపై దాడి ఘటనకు సంబంధించిన పోలీసుల రిమాండ్ రిపోర్టు(Remand Report)లో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో ఏ1గా బీఆర్ఎస్ కార్యకర్త భోగమోని సురేశ్‌ను చేర్చినట్లు పేర్కొన్నారు. మొత్తం 46 మందిని నిందితులుగా గుర్తించామని.. ఇందులో 16 మందిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు.
ఈనెల 11న లగచర్ల(Lagacharla)లో జరిగిన ఘటనపై డీఎస్పీ శ్రీనివాసరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ జరుపుతున్నామని వెల్లడించారు. రాళ్ల దాడి కారణంగా కలెక్టర్, ఇతర అధికారులు, పోలీసులకు సైతం గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. ఘటనలో ఉపయోగించిన రాళ్లు, కర్రలు స్వాధీనం చేసుకున్నట్లు రిపోర్టులో పొందుపరిచారు.
ఫార్మా పరిశ్రమ ఏర్పాటుకు అభిప్రాయ సేకరణ కోసం ఆరోజు ఉదయం 11 గంటలకు అదనపు కలెక్టర్ లింగయ్య, తాండూరు ఇన్‌ఛార్జి కలెక్టర్ ఉమాశంకర్, తహసీల్దార్లు కిషన్ నాయక్, విజయ్‌కుమార్, కడా ప్రత్యేకాధికారి వెంకటరెడ్డి లగచర్లకు వచ్చారని చెప్పుకొచ్చారు. తొలుత గ్రామ శివార్లలో గ్రామ సభ ఏర్పాటు చేశారని వివరించారు. అనంతరం సురేశ్ అనే వ్యక్తి కలెక్టర్ సహా ఇతర అధికారులను గ్రామంలోకి తీసుకువెళ్లాడని పేర్కొన్నారు. కలెక్టర్ రాగానే అందరూ ఒకేసారి గుమిగూడి ఆయన వాహనాన్ని అడ్డగించారని తెలిపారు. దీంతో కలెక్టర్ కారు దిగి వారి వద్దకు వెళ్లి మాట్లాడేందుకు ప్రయత్నం చేస్తుండగానే వాహనాలపై రాళ్లు విసిరి ధ్వంసం చేశారన్నారు. ఈ ఘటనపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.