Sunday, November 16, 2025
HomeతెలంగాణVikarabad Tourism: వికారాబాద్ విడిది.. ప్రకృతి ఒడిలో పర్యాటకుల సందడి!

Vikarabad Tourism: వికారాబాద్ విడిది.. ప్రకృతి ఒడిలో పర్యాటకుల సందడి!

Vikarabad tourist destinations: నగరం ఉరుకుల పరుగుల జీవితానికి, కాంక్రీట్ జంగిల్‌కు వీడ్కోలు చెప్పి, పచ్చని ప్రకృతి ఒడిలో సేదతీరాలనుకుంటున్నారా? అయితే, హైదరాబాద్ వాసులకు ఇప్పుడు వికారాబాద్ ఒక స్వర్గధామంగా మారింది. ఎటుచూసినా కనువిందు చేసే గుట్టలు, దట్టమైన అడవులు, ఆహ్లాదకరమైన వాతావరణంతో ఈ ప్రాంతం రాష్ట్రంలోనే సరికొత్త పర్యాటక ఆకర్షణగా వెలుగొందుతోంది.

- Advertisement -

నగరవాసుల సేదతీరే చిరునామా: హైదరాబాద్‌కు కేవలం 55 కిలోమీటర్ల దూరంలో ఉండటంతో, వారాంతాల్లోనూ, సెలవు రోజుల్లోనూ నగరవాసులు సేదతీరేందుకు వికారాబాద్ వైపు పరుగులు పెడుతున్నారు. కిక్కిరిసిన అపార్ట్‌మెంట్లు, ట్రాఫిక్ హోరు నుంచి ఉపశమనం పొందేందుకు ఇక్కడి ప్రశాంత వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నారు. కేవలం సేదతీరడమే కాదు, పుట్టినరోజు వేడుకలు, పెళ్లి రోజులు, కిట్టీ పార్టీలకు వికారాబాద్ ఫామ్‌హౌస్‌లు, రిసార్టులు వేదికలుగా మారుతున్నాయి.

విహార కేంద్రాలుగా వ్యవసాయ క్షేత్రాలు:  గతంలో పారిశ్రామికవేత్తలు, రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, దిగ్గజ క్రీడాకారులు కొనుగోలు చేసిన వ్యవసాయ భూములు, ఇప్పుడు విలాసవంతమైన విడిది కేంద్రాలుగా రూపాంతరం చెందాయి.

వ్యాపార అవకాశాలు: కొందరు తమ వ్యవసాయ క్షేత్రాలను పర్యాటక వ్యాపారానికి అనుగుణంగా మార్చుకుని, ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. అర ఎకరం నుంచి ఎకరం విస్తీర్ణంలోనే ఈత కొలనులు, క్రీడా మైదానాలు, పండ్ల తోటలు వంటి సకల సౌకర్యాలు కల్పిస్తున్నారు.

ఆన్‌లైన్ బుకింగ్‌లు: యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా తమ రిసార్టుల వివరాలను ప్రచారం చేస్తూ, అడ్వాన్స్ బుకింగ్‌లను స్వీకరిస్తున్నారు.

Also Read: https://teluguprabha.net/telangana-news/hyderabad-ghmc-robot-clears-drains-flood-prevention/

ఉపాధి కల్పన: పరిగి, వికారాబాద్, తాండూరు నియోజకవర్గాల్లో విస్తరించి ఉన్న దాదాపు 660 రిసార్టులు, వ్యవసాయ క్షేత్రాల ద్వారా సుమారు 7,000 మందికి పైగా ఉపాధి లభిస్తోంది. ప్రతి కేంద్రంలో సుమారు 10 నుండి 50 మంది ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు.

తెలంగాణ ఊటీ – అనంతగిరి: వికారాబాద్ పర్యాటకంలో అనంతగిరి కొండలు మణిహారం వంటివి. తెలంగాణలోని ఈ ప్రాంతం “తెలంగాణ ఊటీ”గా పేరుగాంచి, ప్రకృతి ప్రేమికులతో పాటు పర్యాటకులను ఆకర్షిస్తోంది.

ప్రకృతి సోయగం: సుమారు 3,500 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ అటవీ ప్రాంతంలో ఎన్నో ఔషధ మొక్కలు, పచ్చని చెట్లు ఉన్నాయి.

ప్రభుత్వ చర్యలు: పర్యాటకులను మరింతగా ఆకట్టుకునేందుకు అటవీ శాఖ ఇక్కడ అర్బన్ పార్కును అభివృద్ధి చేస్తోంది. లక్నాపూర్, కోట్‌పల్లి, దామగుండం, సర్పన్‌పల్లి ప్రాజెక్టులు కూడా పర్యాటకులకు అదనపు ఆకర్షణలుగా నిలుస్తున్నాయి. ప్రైవేట్ రంగం అందిస్తున్న విలాసవంతమైన సౌకర్యాలకు.. ప్రభుత్వ ప్రోత్సాహం తోడవడంతో వికారాబాద్ జిల్లా రాష్ట్ర పర్యాటక పటంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సుస్థిరం చేసుకుంటోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad