Village of doctors in Telangana : నాగలి పట్టే చేతులు.. ఇప్పుడు నాడి పడుతున్నాయి. పొలం గట్లపై పెరిగిన పిల్లలు.. ఇప్పుడు స్టెతస్కోపులు పట్టి ప్రాణాలు నిలుపుతున్నారు. జగిత్యాల జిల్లాలోని ఓ చిన్న పల్లెటూరు, వైద్య విద్యలో ఓ నిశ్శబ్ద విప్లవాన్ని సృష్టిస్తోంది. ఆరేళ్ల క్రితం కేవలం ఒక్కరే ఉన్న ఆ ఊరిలో, నేడు ఏకంగా 13 మంది డాక్టర్లు, వైద్య విద్యార్థులు ఉన్నారు.
జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్.. వ్యవసాయమే జీవనాధారంగా ఉన్న ఓ పల్లెటూరు. ఇక్కడి రైతులు ఆధునిక పద్ధతులతో మంచి దిగుబడులు సాధిస్తూ, ఆర్థికంగా నిలదొక్కుకున్నారు. అయితే, వారి ఆలోచనలు కేవలం పొలం గట్లకే పరిమితం కాలేదు, తమ పిల్లల భవిష్యత్తుపై ఉన్నతమైన కలలు కన్నారు.
ఒక్క సన్మానం.. ఆలోచన రేకెత్తించింది
ఆరేళ్ల క్రితం, గ్రామానికి చెందిన కొప్పెర వెంకట్‌రెడ్డి కుమారుడు మహేశ్‌రెడ్డి, ఎంబీబీఎస్ పూర్తి చేసి గ్రామానికి తిరిగి వచ్చారు. ఆ సందర్భంగా, రైతు సంఘం ఆధ్వర్యంలో గ్రామస్థులందరూ కలిసి అతడిని ఘనంగా సన్మానించారు.
Also Read: https://teluguprabha.net/career-news/jyothi-reddy-from-daily-labour-to-ceo-success-story/
ఆ ఒక్క సన్మాన కార్యక్రమం, గ్రామంలోని ఇతర రైతుల మదిలో ఓ ఆలోచనకు బీజం వేసింది. “మన పిల్లలను కూడా ఎందుకు డాక్టర్లను చేయకూడదు?” అనే ప్రశ్న వారిలో మొదలైంది.
ఒకరిని చూసి మరొకరు స్ఫూర్తి పొంది, తమ పిల్లలను వైద్య విద్య వైపు ప్రోత్సహించడం ప్రారంభించారు.
ఫలించిన కలలు.. వైద్యుల గ్రామంగా
తల్లిదండ్రుల ప్రోత్సాహానికి, పిల్లల కఠోర శ్రమ తోడవడంతో, లక్ష్మీపూర్ గ్రామం నేడు ‘వైద్యుల గ్రామంగా’ రూపుదిద్దుకుంటోంది.
డాక్టర్ మహేశ్‌రెడ్డి: ఆరేళ్ల క్రితం వైద్యుడైన ఈయనే ఆ ఊరి స్ఫూర్తి ప్రదాత. ప్రస్తుతం జగిత్యాలలో వైద్యశాలను ఏర్పాటు చేసి, గ్రామస్థులకు ఉచితంగా సేవలు అందిస్తున్నారు.
కాబోయే వైద్యులు: పన్నాల తిరుపతిరెడ్డి కుమార్తె శ్రేయ, గడ్డం తిరుపతిరెడ్డి కుమారుడు గోవర్ధన్‌రెడ్డి, ఎర్రవల్లి జనార్దన్ కుమారుడు శ్రీనాథ్, నేతి రమేశ్ కుమారుడు రాకేశ్, కొడిమ్యాల రమేశ్ కుమారుడు నవీన్.. ఇలా ఒకరి తర్వాత ఒకరు వైద్య విద్యలో రాణిస్తున్నారు.
ప్రస్తుతం ఈ ఊరిలో డాక్టర్లు, వైద్య విద్యార్థులు కలిపి మొత్తం 13 మంది ఉన్నారు. ఇందులో చాలామంది తమ ప్రతిభతో ప్రభుత్వ కళాశాలల్లో ఉచిత సీట్లు సంపాదించడం మరో విశేషం.
దేవుడి ప్రతిరూపాలుగా..
“వైద్యం అనేది కేవలం వృత్తి కాదు, అదొక సేవ, బాధ్యత” అనే నానుడిని ఈ రైతు బిడ్డలు నిజం చేస్తున్నారు. తమ పిల్లలు కేవలం డబ్బు సంపాదించడమే కాకుండా, సమాజానికి సేవ చేసే ఉన్నతమైన వృత్తిని ఎంచుకున్నందుకు లక్ష్మీపూర్ గ్రామ పెద్దలు గర్వంగా చెబుతున్నారు. ఒక చిన్న స్ఫూర్తి కణం, ఓ గ్రామం తలరాతను ఎలా మార్చగలదో చెప్పడానికి లక్ష్మీపూర్ ఓ చక్కటి ఉదాహరణ.


