ఓటమి భయంతో మంత్రి శ్రీనివాస్ గౌడ్ విచక్షణ కోల్పోయి మాట్లాడుతున్నాడని, మృదు స్వభావి, ప్రజల మనిషి, తెలంగాణ ఉద్యమ కారుడైనా తమ అభ్యర్థి యెన్నం శ్రీనివాస్ రెడ్డి మీద అబండాలు వేస్తే చూస్తూ ఊరుకోమని పి సి సి ప్రధాన కార్యదర్శి ఎస్ వినోద్ కుమార్ అన్నారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో ఆయన మాట్లాడుతూ… గత సంవత్సరం తన హత్యకు కుట్ర చేశారని నేరం మోపిన వ్యక్తులకు మాజీ ఎంపీ ఏ పి జితేందర్ రెడ్డి షెల్టర్ ఇస్తే మరి జితేందర్ రెడ్డి మీద మంత్రి ఎందుకు కేసు పెట్టలేదని ప్రశ్నించారు. జితేందర్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ ఇద్దరు ఒకటే నని అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో 2014కు ముందు అభివృద్ధి లేదనడం మంత్రి అవివేకం అని అన్నారు. రాజకీయంలో సుదీర్ఘ అనుభవం ఉన్న పి చంద్రశేఖర్, ముత్యాల ప్రకాష్ ముందే ఈ మాట అనడం సిగ్గుచేటని విమర్శించారు. మహబూబ్ నగర్ లో నిర్వహించిన ఐటీ జాబ్ మేళా అనేది ఉత్తదేనని, జాబ్ పేరుతో మంత్రి నిరుద్యోగులను మోసం చేశాడని అన్నారు. మంత్రి నిజంగా ఐటీ ఉద్యోగాలు ఇప్పిస్తే వాళ్ళ జాబితా ప్రజల ముందు ఉంచాలని డిమాండ్ చేశారు. మంత్రి ఎన్ని జిమ్మిక్కులు చేసినా గెలిచేది కాంగ్రెస్ అని ధీమా వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న హాస్పిటల్ నిర్మాణానికి అడ్డుగా ఉన్న రేకులను ఎన్నికలు వచ్చాక ఎందుకు తొలగించారో మంత్రి ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. ఓటర్లను ప్రభావితం చేయడానికే ఇలా చేశాడని, ఇది ఎన్నికల నియమావళికి విరుద్ధం అని ఆరోపించారు. ఎంతో విలువైన ప్రభుత్వ స్థలంలో అక్కడ నిర్మిస్తున్న మల్టిఫ్లెక్స్ బీఆర్ఎస్ కు చెందిన తన అనుచరులకు లీజ్ కు ఇచ్చాడని అన్నారు. ప్రజల సొమ్మును తన ఎదుగుదలకు వాడుకుంటున్నాడని మండిపడ్డారు. ప్రజలు ఇది అర్థం చేసుకోవాలని అన్నారు. యెన్నం శ్రీనివాస్ రెడ్డికి మహబూబ్ నగర్ నియోజకవర్గం ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని, ఈ ఎన్నికల్లో విజయం కాంగ్రెస్ దే అన్నారు. ఈ సమావేశంలో సిరాజ్ ఖాద్రి, లక్ష్మణ్ యాదవ్, సి జె బెనహర్ తదితరులు పాల్గొన్నారు.