Seasonal diseases outbreak in Medak : ఒకవైపు ముసురుపట్టిన వానలు, మరోవైపు పడకేసిన పారిశుద్ధ్యం.. ఈ రెండింటి మధ్య ఉమ్మడి మెదక్ జిల్లా నలిగిపోతోంది. వాతావరణ మార్పులతో విషజ్వరాలు పల్లె, పట్టణం తేడా లేకుండా పంజా విసురుతున్నాయి. ఇంటింటికీ జ్వరం, గొంతునొప్పి, ఒళ్లు నొప్పులతో జనం అల్లాడిపోతున్నారు. ఆసుపత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి. అత్యంత ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే, జ్వరం తగ్గినా ఒళ్లు, కాళ్ల నొప్పుల రూపంలో నీరసం వెంటాడుతూనే ఉంది. అసలు ఈ వింత జ్వరాలకు కారణమేంటి..? డెంగీ మహమ్మారి మళ్లీ పడగ విప్పుతోందా..? ఈ సీజనల్ వ్యాధుల కబంధ హస్తాల నుంచి బయటపడాలంటే ఏం చేయాలి..?
ఇంటింటా జ్వర పీడితులు: ఉమ్మడి మెదక్ జిల్లాలోని సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాల్లోని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులు రోగులతో నిండిపోతున్నాయి.
సాధారణ లక్షణాలు: జలుబు, జ్వరంతో మొదలై, తీవ్రమైన గొంతునొప్పి, భరించలేని ఒళ్లు నొప్పులతో బాధితులు విలవిలలాడుతున్నారు. కొందరిలో శరీరంపై దురద వంటి లక్షణాలు కూడా కనిపిస్తున్నాయి.
తగ్గినా వీడని తిప్పలు: వారం రోజుల పాటు మందులు వాడితే జ్వరం తగ్గుతున్నప్పటికీ, తీవ్రమైన నీరసం, ఒళ్లు నొప్పులు మాత్రం రోజుల తరబడి వేధిస్తూనే ఉన్నాయని సంగారెడ్డికి చెందిన అనేక మంది బాధితులు వాపోతున్నారు.
పడకేసిన పారిశుద్ధ్యం – విజృంభిస్తున్న దోమలు: సీజనల్ వ్యాధులు ఇంతలా ప్రబలడానికి ప్రధాన కారణం అధ్వానంగా మారిన పారిశుద్ధ్యమేనని స్పష్టమవుతోంది.
మురికికూపాలుగా కాలనీలు: వర్షాలకు పల్లెల్లో, పట్టణాల్లోని అనేక కాలనీలు మురికికూపాలను తలపిస్తున్నాయి. నిలిచిన నీరు దోమలకు నిలయంగా మారింది.
నిధుల కొరత: పంచాయతీల్లో, మున్సిపాలిటీల్లో నిధుల కొరత, అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగా దోమల నివారణ చర్యలు, పారిశుద్ధ్య కార్యక్రమాలు నామమాత్రంగానే సాగుతున్నాయి.
డెంగీ డేంజర్ బెల్స్: వైరల్ జ్వరాలతో పాటు, డెంగీ మహమ్మారి కూడా జిల్లాను వణికిస్తోంది.
సంగారెడ్డిలో 124 కేసులు: ఒక్క సంగారెడ్డి జిల్లాలోనే ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు 124 డెంగీ కేసులు నమోదయ్యాయంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.
మరణ మృదంగం: ఇటీవల మెదక్ జిల్లా కౌడిపల్లి మండలంలో ఇద్దరు విద్యార్థులు, సిద్దిపేట జిల్లా తిమ్మాపూర్‌లో ఇద్దరు యువకులు విషజ్వరాలు, డెంగీ బారిన పడి మృతిచెందడం జిల్లా ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తోంది.
వైద్యుల సూచనలు: “జ్వరం వచ్చిన వెంటనే సొంత వైద్యం చేసుకోకుండా, దగ్గరలోని ఆసుపత్రికి వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకోవాలి,” అని జిల్లా వైద్యాధికారి శ్రీరామ్ సూచిస్తున్నారు. “యాంటీబయాటిక్స్ విచ్చలవిడిగా వాడటం వల్ల ప్రయోజనం కంటే నష్టమే ఎక్కువ. వైద్యుల సలహా మేరకే మందులు వాడాలి. నీరసం, ఒళ్లు నొప్పులు తగ్గడానికి బీ-కాంప్లెక్స్ విటమిన్లు, పోషకాహారం తీసుకోవడం ముఖ్యం,” అని ఆయన తెలిపారు.
అధికారులు తక్షణమే స్పందించి, పారిశుద్ధ్య కార్యక్రమాలను యుద్ధప్రాతిపదికన చేపట్టి, దోమల నివారణ చర్యలు తీసుకోకపోతే, ఉమ్మడి మెదక్ జిల్లాలో ప్రజారోగ్య వ్యవస్థ ప్రమాదంలో పడే అవకాశం ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


