నియోజకవర్గంలో తాను చేసిన అభివృద్ధి పనులు చూసి ప్రజలు మరోసారి ఆశీర్వదించాలని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రజలను కోరారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని 32 , 13వ వార్డులలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. పలు కాలనీలలో ఇంటింటికి వెళ్లి మహిళలు వృద్ధులు అందరిని కలిసి మరోసారి తనకు ఓటు వేసి గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వనపర్తి ప్రజలు మీరందరూ వాస్తవాలు గ్రహించాలని, దశాబ్దాల పాటు అధికారం అనుభవించి తెలంగాణ ప్రజల జీవితాల్లో అంధకారం నింపిన కాంగ్రెస్ పార్టీ పాలన కావాలా …పదేళ్ల పాలనలోనే ప్రజల జీవితాల్లో వెలుగులు నింపిన కేసీఆర్ పాలన కావాలా అన్నది విజ్ఞులు, మేధావులు అయిన వనపర్తి ప్రజలు ఒక్కసారి మనసుపెట్టి ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. తొమ్మిదేళ్లలో వనపర్తి నియోజకవర్గంలో జరిగిన అభివృద్ది గురించి మీరందరూ చర్చించాలని, వనపర్తిలో నెలకొల్పిన విద్యాసంస్థల గురించి విద్యార్థులు, యువత గమనించాలని ఆయన కోరారు. ముఖ్యంగా నియోజకవర్గంలో లక్ష పైచిలుకు ఎకరాలకు సాగునీరు, మత్య్స కళాశాల, మెడికల్ కళాశాల, నర్సింగ్ కళాశాల, ఇంజనీరింగ్ కళాశాల, మహిళా వ్యవసాయ డిగ్రీ కళాశాల, రోడ్ల విస్తరణ, 376 చెరువుల పునర్నిర్మాణం, రహదారుల విస్తరణ, ప్రతి ఊరికి, తండాకు బీటీ రహదారులు నిర్మించామని , నూతన సబ్ స్టేషన్లతో విద్యుత్ వ్యవస్థను పటిష్టం చేశామని కనుక చైతన్యవంతమైన వనపర్తి ప్రజలు పనిచేసిన వారికి ఆశీస్సులు అందించి అండగా ఉండాలని మంత్రి నిరంజన్ రెడ్డి కోరారు.
మంత్రి నిరంజన్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరికలు….
జిల్లా కేంద్రం లోని 32 వ వార్డు కు చెంది బీజేపీ మైనార్టీ నాయకుడు ఖాజా, సురేష్ నాయడు, రాముల ఆధ్వర్యంలో 30 మంది బీజేపీ నాయకులు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు. అభివృద్ధి పనులను చూసి బిఆర్ఎస్ పార్టీలోకి స్వచ్ఛదంగా వచ్చామని, భవిష్యత్తులో జరుగబోయే అభివృద్ధిలో మేమంతా భాగ్యస్వాములు కావడం చాలా అనందంగా ఉందని పార్టీలో చేరిన నాయకులు తెలిపారు.
మంత్రి వెంట జిల్లా పరిషత్ చైర్మన్ లోకనాథ్ రెడ్డి , గ్రంధాలయ జిల్లా చైర్మన్ లక్ష్మయ్య, జిల్లా అధ్యక్షుడు గట్టు యాదవ్ , మార్కెట్ కమిటీ చైర్మన్ పలుస రమేష్ గౌడ్ , జిల్లా అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్ , జిల్లా నాయకులు రాములు యాదవ్, కౌన్సిలర్లు లక్ష్మి నారాయణ, మీడియా సెల్ కన్వీనర్లు నందిమల్ల శ్యామ్, నందిమల్ల అశోక్ తదితరులు పాల్గొన్నారు.