Vote Without Voter Identity Card in Jubilee Hills bypoll: తెలంగాణలో జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు ఇప్పటికే షెడ్యూల్ విడుదల అయ్యింది. బీహార్ ఎన్నికలతో పాటే జూబ్లీహిల్స్ బైపోల్‌కు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 13న నోటిఫికేషన్ విడుదల కానుంది. మరోవైపు, నవంబర్ 11న ఉప ఎన్నిక పోలింగ్ జరగనుంది. అన్ని పార్టీలు ఉప ఎన్నికకు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఇప్పటికే బీఆర్‌ఎస్, కాంగ్రెస్ తమ అభ్యర్థులను ప్రకటించాయి. బీఆర్‌ఎస్ నుంచి మాజీ ఎమ్మెల్యే దివంగత మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునితకు టికెట్ ఖరారైంది. మరోవైపు, అధికార కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్‌కు టికెట్ దక్కింది. ఈ నేపథ్యంలోనే జూబ్లీహిల్స్ పోల్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ ఎన్నిక ఫలితాలు రాబోయే స్థానిక ఎన్నికలపై ఎఫెక్ట్ చూపనున్నాయి. ఈ నేపథ్యంలోనే అన్ని పార్టీలు జూబ్లీహిల్స్ బైపోల్‌ను సీరియస్‌గా తీసుకున్నాయి. అయితే, జూబ్లీహిల్స్‌కు సంబంధించిన తుది ఓటరు లిస్టును ఈసీ ఇటీవలే ప్రకటించింది. ఈ లిస్టులో మీ పేరు ఉండే చాలు ఓటర్ ఐడీ లేకున్నప్పటికీ.. కొన్ని పత్రాల ద్వారా మీరు ఓటు వేయవచ్చు. ఓటరు గుర్తింపు కార్డు లేనివారు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్ తెలిపారు. 12 రకాల ఫోటో ఐడీలలో ఏదైనా ఒక్కటి చూపించి మీ ఓటు హక్కును వినియోగించుకోవచ్చని స్పష్టం చేశారు. పోలింగ్ బూత్‌లో ఈ 12 ఐడెంటిటీ కార్డుల్లో ఏదో ఒకటి చూపించి మీ ఓటు హక్కు వినియోగించుకోవచ్చు. అవేంటో చూద్దాం.
చెల్లుబాటు అయ్యే ఐడెంటిటీ కార్డులు..
1. ఆధార్ కార్డు
2. ఉపాధిహామీ జాబ్ కార్డు
3. బ్యాంక్/పోస్ట్ ఆఫీస్ ఫోటో పాస్‌బుక్
4. ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డు / కేంద్ర కార్మికశాఖ స్మార్ట్ కార్డు
5. డ్రైవింగ్ లైసెన్స్
6. పాన్ కార్డు
7. NPR కింద RGI జారీ చేసిన స్మార్ట్ కార్డు
8. భారతీయ పాస్‌పోర్ట్
9. ఫోటో ఉన్న పెన్షన్ పత్రాలు
10. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల ఆఫీషియల్ ఐడీ కార్డులు
11. ఎంపీ/ఎమ్మెల్యే/ఎమ్మెల్సీ అధికారిక గుర్తింపు కార్డులు
12. UDID (దివ్యాంగుల ప్రత్యేక గుర్తింపు కార్డు)
కాగా, ఓటర్ జాబితాలో మీ పేరు ఉండి.. ఈ 12 ప్రత్యామ్నాయ గుర్తింపు కార్డులలో ఏ ఒక్కటి ఉన్నా ఓటు వేయొచ్చని కర్ణన్ తెలిపారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని ప్రజలంతా తప్పకుండా తమ ఓటు హక్కుని వినియోగించుకోవాలని, ఎక్కువ మంది ఓటింగ్ ప్రక్రియలో పాల్గొనాలని కోరారు. హైదరాబాద్ నగరంలో ప్రతిసారి తక్కువ ఓటింగ్ శాతం నమోదవుతోందని, ఈసారి ఎక్కువ మంది ఓటింగ్ ప్రక్రియలో పాల్గొనేలా అవగాహన కల్పించాలని అధికారులను కోరారు.


