Telangana brownfield airports development : చారిత్రక ప్రాధాన్యత కలిగిన మామునూరు విమానాశ్రయం, నిజాం కాలంలో కళకళలాడి ఆ తర్వాత నిరుపయోగంగా మారినప్పటికీ, ఇప్పుడు తిరిగి విమాన సేవలను పునఃప్రారంభించడానికి సన్నద్ధమవుతోంది. . కేవలం వరంగల్లే కాదు, ఆదిలాబాద్‌లోనూ విమాన రెక్కల చప్పుడు వినిపించనుంది. ఈ రెండు విమానాశ్రయాల పనులను ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) ఎప్పుడు ప్రారంభించనుంది..? చిన్న విమానాల కోసం వేసిన ప్రణాళికను పెద్ద విమానాల కోసం ఎందుకు మార్చారు.? ఈ బృహత్కార్యానికి ప్రభుత్వం కేటాయించిన నిధులెన్ని..?
తెలంగాణలో ప్రాంతీయ విమానయానానికి మహర్దశ పట్టనుంది. రాష్ట్రంలోని చారిత్రక నగరం వరంగల్, సరిహద్దు జిల్లా ఆదిలాబాద్‌లలో రానున్న రెండేళ్లలో బ్రౌన్‌ఫీల్డ్ విమానాశ్రయాలను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెచ్చేందుకు ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) కసరత్తును ముమ్మరం చేసింది. భూసేకరణ ప్రక్రియ దాదాపుగా కొలిక్కి రావడంతో, ఈ ఏడాది చివరికల్లా పనులు ప్రారంభించేందుకు సర్వం సిద్ధం చేస్తోంది.
వరంగల్‌కు రూ.205 కోట్లు : నిజాం హయాంలో నిర్మితమై, 1981 వరకు వాయుదూత్ సేవలతో కీలకంగా ఉన్న మామునూరు విమానాశ్రయ పునరుద్ధరణకు నూతన ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోంది. విమానాశ్రయ అభివృద్ధికి అత్యంత కీలకమైన భూసేకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం గత నెలలోనే రూ.205 కోట్లను విడుదల చేసింది. ఈ నిధులతో అవసరమైన 253 ఎకరాల భూమిని సేకరించే ప్రక్రియ తుది దశకు చేరుకుంది. మొదట ఇక్కడ ఏటీఆర్ వంటి చిన్న విమానాల రాకపోకలకు అనుగుణంగా అభివృద్ధి చేయాలని ఏఏఐ భావించినప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు ప్రణాళికలో మార్పులు చేసింది. ఏకంగా ఏ320, బోయింగ్ 737 వంటి పెద్ద విమానాలు, కార్గో విమానాలు సైతం దిగేలా రన్‌వే విస్తరణ, ఇతర పనులను చేపట్టాలని ఏఏఐ నిర్ణయించడం ఓరుగల్లు అభివృద్ధికి ఊతమివ్వనుంది.
ఆదిలాబాద్‌కూ వాయుసేన పచ్చజెండా : మరోవైపు, ఆదిలాబాద్‌లో విమానాశ్రయ నిర్మాణానికి భారత వాయుసేన (IAF) తన అంగీకారాన్ని తెలపడంతో పనులు వేగవంతం కానున్నాయి. ఇప్పటికే వాయుసేన ఆధీనంలో 362 ఎకరాల స్థలం అందుబాటులో ఉండగా, విమానాశ్రయానికి అవసరమైన అదనపు భూమిని సేకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
రెండేళ్లలో పూర్తి.. వాస్తవ గడువు ఎప్పుడు : ఈ రెండు విమానాశ్రయాలను 2027 జూన్ నాటికి అందుబాటులోకి తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. అయితే, స్థానిక పరిస్థితులు, పనుల పురోగతిని అంచనా వేసిన కేంద్రం, 2027 డిసెంబర్ నాటికి పూర్తిచేయగలమని సమాధానమిచ్చినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. రామగుండం, నిజామాబాద్‌లలోనూ విమానాశ్రయాల ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నా, వాటికి అనుమతులు లభించడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. ఏదిఏమైనా, దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ వరంగల్, ఆదిలాబాద్ గగనతలంలో త్వరలోనే విమానాలు విహరించనున్నాయి.


