Warangal Urban Flooding : రాష్ట్ర రెండో రాజధానిగా కీర్తి ప్రతిష్టలు.. కానీ చిన్నపాటి వానకే చిగురుటాకులా వణికిపోతోంది. కుండపోత వర్షం కురిస్తే చాలు, వీధులన్నీ నదులను తలపిస్తాయి. ఇళ్లలోకి వరద నీరు చేరి జలదిగ్బంధంలో చిక్కుకుపోవడం ఓరుగల్లు వాసులకు గత 20 ఏళ్లుగా ఓ శాపంగా మారింది. ప్రభుత్వాలు మారుతున్నాయి, పాలకులు హామీలు ఇస్తున్నారు, కానీ వరంగల్ తలరాత మాత్రం మారడం లేదు. ఏటికేడు సమస్య తీవ్రమవుతోందే తప్ప శాశ్వత పరిష్కారం ఎందుకు కనిపించడం లేదు? ఈ ముంపు వెనుక ఉన్న అసలు కారణాలేంటి? నిపుణులు సూచిస్తున్న పరిష్కారాలేమిటి? ఈ జలవిలయంపై సమగ్ర కథనం.
కన్నీటి గాథ.. ఏటికేడు పెరుగుతున్న ముంపు : ఓరుగల్లు ముంపు సమస్యకు రెండు దశాబ్దాల చరిత్ర ఉంది. నాడు చిన్నపాటి వానకే మొదలైన ఈ కష్టాలు, నేడు కుంభవృష్టిని తట్టుకోలేని దయనీయ స్థితికి చేరాయి.
2005: కేవలం 4-5 సెం.మీ వర్షానికే 15 కాలనీలు నీట మునిగాయి. బొందివాగు నాలా ఉప్పొంగి ఇద్దరిని బలి తీసుకుంది.
2007 – 2012: వర్షపాతం 10 సెం.మీ చేరేసరికి ముంపునకు గురైన కాలనీల సంఖ్య 25కు పెరిగింది. వరద ఉద్ధృతికి ఒకరు గల్లంతయ్యారు.
2016: 14-16 సెం.మీ వర్షపాతంతో 45 కాలనీలు జలమయమయ్యాయి. నయీంనగర్ నాలా ఉగ్రరూపం దాల్చడంతో నగరం వణికిపోయింది.
2021: 24 సెం.మీ రికార్డు స్థాయి వర్షపాతంతో నగరం అతలాకుతలమైంది. ఏకంగా 100 కాలనీలు నీట మునిగాయి, నలుగురు ప్రాణాలు కోల్పోయారు.
2023 – 2025: పరిస్థితి మరింత తీవ్రమైంది. 2023లో 28 సెం.మీ వర్షానికి 60 కాలనీలు, ఇటీవల 2025 అక్టోబరు 29న కురిసిన కుండపోత వానకు 45 కాలనీలు నీట మునిగాయి. సుమారు 30 వేల గృహాలు ఇబ్బందులకు గురయ్యాయి, రవాణా వ్యవస్థ రెండు రోజుల పాటు స్తంభించిపోయింది.
ప్రతిపాదనలకే పరిమితమైన పరిష్కారాలు : భవిష్యత్తులో కుంభవృష్టి వర్షాలే అధికమని నిపుణులు హెచ్చరిస్తున్నా, అందుకు తగ్గట్టుగా నగరంలో వరద నీటి కాలువలు, అంతర్గత డ్రైనేజీ వ్యవస్థను బలోపేతం చేయడంలో పాలకులు విఫలమవుతున్నారు. నాలాల విస్తరణ, అండర్ డ్రైనేజీ నిర్మాణం వంటి శాశ్వత పరిష్కార పనులు కేవలం ప్రతిపాదనలకే పరిమితం అవుతున్నాయి. చెరువుల కబ్జాలు, నాలాలను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టడం కూడా సమస్య తీవ్రతకు ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి.
చేయాల్సింది ఇదే.. శాశ్వత పరిష్కారం కోసం : ఈ ముంపు గండం నుంచి ఓరుగల్లును గట్టెక్కించాలంటే తక్షణమే ఈ చర్యలు చేపట్టాలి:
వరద మళ్లింపు: నగర శివారులోనే వరద నీటిని ఇతర ప్రాంతాలకు మళ్లించేలా ప్రణాళికలు రచించాలి.
నాలాల విస్తరణ: భద్రకాళి, వడ్డేపల్లి, కాజీపేట బంధం వంటి ప్రధాన చెరువులకు అనుసంధానంగా ఉన్న నాలాలను విస్తరించి, పూడిక తొలగించాలి.
వరద నీటి కాలువలు: వరంగల్, హనుమకొండ నగరాల్లో ప్రత్యేకంగా వరద నీటి కాలువలను (Stormwater Drains) నిర్మించాలి.
అండర్ డ్రైనేజీ: ఆధునిక అండర్ డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేయాలి.
శాశ్వత పనులు: తరచూ ముంపునకు గురయ్యే కాలనీలను గుర్తించి, అక్కడ శాశ్వత ప్రాతిపదికన పనులు చేపట్టి, ప్రజలకు భరోసా కల్పించాలి.


