తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాలు ప్రతి పల్లె పల్లెలో పండుగలా నిర్వహించాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు జిల్లా కలెక్టర్లు, అన్ని శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులను అదేశించారు. పాలకుర్తి నియోజకవర్గం విస్తరించి ఉన్న జనగామ, వరంగల్, మహబూబాబాద్ జిల్లాల అన్ని శాఖల అధికారులను మంత్రి పాలకుర్తిలోని తన క్యాంపు కార్యాలయానికి పిలిపించుకొని రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల నిర్వహణపై ప్రత్యేకంగా గురువారం సమీక్ష చేశారు.
ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ, తెలంగాణ ఆవిర్భావ దశాబ్ధి ఉత్సవాలు పెద్ద ఎత్తున జరుపుకోవాలి. ఘనంగా నిర్వహించాలి. పండుగలా జరగాలి. ఇందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రుజలను భాగస్వాములను చేస్తూ జూన్ 2వ తేదీ నుండి 22వ తేదీ వరకు 21 రోజుల పాటు నిర్వహించే అన్ని ఉత్సవాలను విజయవంతం చేయాలన్నారు. మన రాష్ట్రం దేశంలోనే రాష్ట్రం నెంబర్ వన్ గా ఉంది. అన్ని శాఖల్లో అనేక అవార్డులు సాధించాం. ఈ వేడుకలను విజయోత్సవంగా నిర్వహించాలని ఆదేశించారు. మిగతా శాఖలకు భిన్నంగా ఎక్కువ శాఖలతో మనకే ఎక్కువ అనుబంధం ఉంది. అందుకే ఆయా ఉత్సవాలను నిర్వహించే బాధ్యత మనపై ఎక్కువగా ఉందని సూచించారు. 21 రోజుల పాటు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మంచినీటి సరఫరా శాఖలు ఎక్కువ భాగస్వామ్యం కావాలి. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం కార్యక్రమాలు నిర్వహిస్తూనే పాలకుర్తి నియోజకవర్గం లో ప్రత్యేకంగా మరికొన్ని కార్యక్రమాలు నిర్వహించాలని మంత్రి ఎర్రబెల్లి నిర్ణయించారు.
జూన్ 3వ తేదీన రైతు దినోత్సవం ఘనంగా జరపాలి. ఆరోజు మార్కెట్ యార్డుల్లో రైతు కొనుగోలు కేంద్రాల వద్ద సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకాలు చేయాలి. తాను వరంగల్ మార్కెట్ తోపాటు రాయపర్తి, తొర్రూరు, పెద్ద వ0గర, కొడకండ్ల తదితర పాలకుర్తి నియోజకవర్గం లోని అన్ని మార్కెట్ యార్డులను సందర్శిస్తానని మంత్రి తెలిపారు.
నాలుగవ తేదీన సురక్ష దినోత్సవ సందర్భంగా జనగామ జిల్లా కేంద్రంలో ర్యాలీ నిర్వహించాలని పోలీసు శకటాలు గౌరవ వందన స్వీకారం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలను విస్తృతంగా భాగస్వాములను చేయాలని పోలీసు శాఖ ద్వారా జరుగుతున్న రక్షణ, శాంతి భద్రతల పరిరక్షణ కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని మంత్రి తెలిపారు.
ఐదవ తేదీన తెలంగాణ విద్యుత్ విజయోత్సవం కార్యక్రమాన్ని పాలకుర్తి నియోజకవర్గం లో ప్రత్యేకంగా నిర్వహిస్తూ ఆరోజు పోలేపల్లి చిట్యాల సబ్ స్టేషన్ లకు శంకుస్థాపన జరపాలని, అలాగే పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంలో భారీ ర్యాలీ సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా గ్రామాలకు పెరిగిన విద్యుత్ సదుపాయాలను తెలపాలి అన్నారు.
జూన్ ఆరవ తేదీన పారిశ్రామిక ప్రగతి ఉత్సవం సందర్భంగా పాలకుర్తి నియోజకవర్గం లో నూతనంగా ఏర్పాటు చేయనున్న కొడకండ్ల మినీ టెక్స్టైల్ పార్క్ కి శంకుస్థాపన చేయాలని, మేరకు ఏర్పాట్లు చేయాల్సిందిగా జిల్లా కలెక్టర్ సంబంధిత శాఖల అధికారులను మంత్రి ఆదేశించారు
7న సాగునీటి దినోత్సవం పండుగ ను చెక్ డ్యాం ల వద్ద ఏర్పాటు చేసుకోవాలి. ఆరోజు నియోజకవర్గంలోని 129 గ్రామాల్లో 108 చెరువుల వద్ద చెరువుల పండుగ నిర్వహించాలని అలాగే కాలువల వెంట నీటిని విడుదల చేయాలని ఆ అంశాలను ప్రజలకు అర్థం చేయాలని, అలాగే పాలకుర్తి నియోజకవర్గం లోని 1000 మందితో ఒక సమావేశం నిర్వహించి సాగునీటి ప్రాధాన్యతలను ప్రజలకు వివరించాలని మంత్రి తెలిపారు పెద్ద వంగర, రాయపర్తి, మైలారం, తొర్రూరు ప్రాంతాలలో నీటి కాలువల వద్ద సీఎం గారి చిత్రపటానికి పాలాభిషేకం చేయాలని మంత్రి ఆదేశించారు.
8న ఊర్ల ల్లో చెరువుల పండుగ సందర్భంగా ప్రజలను చెరువుల వద్దకు తీసుకెళ్ళి, చెరువుల్లో నీటిని చూపించాలి. కట్ట మైసమ్మ పండుగ నిర్వహిస్తూ మేకలను కోళ్లను కోసుకోవాలి అక్కడే దావతులు జరిగేటట్టు చూడాలి అని మంత్రి తెలిపారు.
9న తెలంగాణ సంక్షేమ సంబరాలు సందర్భంగా కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కులను పంపిణీ చేయాలి అలాగే రాయపర్తిలో గొర్రెల పంపిణీ కార్యక్రమం నిర్వహించాలి. కులవృత్తుల వారికి ప్రభుత్వం వినూత్నంగా అందించనున్న లోన్లను అందించేందుకు ఏర్పాటు చేయాలి. అలాగే కొడకండ్ల పాలకుర్తి దేవరుప్పుల మండలాలలో ఇండ్ల పట్టాలు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేయాలి. ఆరోజు పాలకుర్తి లో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించాలని మంత్రి ఆదేశించారు.
10న సుపరిపాలన దినోత్సవం సందర్భంగా కొత్తగా జిల్లాలు, మండలాలు, గ్రామ పంచాయతీలు ఏర్పాటయ్యాయి. వాటిని అందంగా అలంకరించి, విజయోత్సవాలను నిర్వహించాలి. కొత్తగా భవనాలు ఉంటే వాటిని ప్రారంభించాలి. కొత్తగా ఏర్పడిన జనగామ జిల్లా కేంద్రం, పెద్ద వంగర మండల కేంద్రం, తొర్రూరు మున్సిపాలిటీ, ఆర్డీవో ఆఫీసు, డిఎస్పి, కొత్త గ్రామపంచాయతీ భవనాలు తండాలు గూడాలలో పెద్ద ఎత్తున ఉత్సవ కార్యక్రమాలు ఏర్పాటు చేసి ప్రజలను భాగస్వాములను చేయాలని మంత్రి వివరించారు. ఆరోజు కెసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకాలు చేయాలని చెప్పారు. అదే రోజు రాయపర్తి మండలంలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించాలని మంత్రి నిర్ణయించారు.
11వ తేదీన తెలంగాణ సాహిత్య దినోత్సవం సందర్భంగా ఆత్మీయ సమ్మేళనాలు, కవి సమ్మేళనాలు నిర్వహించాలని మంత్రి అధికారులకు తెలిపారు. తొర్రూరు మండలం మాటేడు, ఫతేపురం గ్రామాలకు సంబంధించి ఆత్మీయ సమ్మేళనం నిర్వహించనున్నారు.
12వ తేదీన తెలంగాణ రన్ నిర్వహించాలని ఆ రోజు పాలకుర్తి లో ఉదయం 6, 7 గంటల మధ్య కొడకండ్ల, పాలకుర్తి, తొర్రూరు, పెద్దవంగర, రాయపర్తి, దేవరుప్పుల మొత్తం మండలాల నాయకులు ప్రజలు అధికారులు అందరిని భాగస్వామ్యం చేస్తూ పాలకుర్తిలో భారీగా తెలంగాణ రన్ నిర్వహించాలని మంత్రి తెలిపారు.
13న మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని పాలకుర్తి తొర్రూరు కేంద్రాలలో 600 చొప్పున ఉచిత కుట్టుమిషన్లు పంపిణీ చేయాలని మంత్రి నిర్ణయించారు. అలాగే పెద్ద వంగర గ్రామంలో మహిళలకు మహిళా సంఘాలకు చెక్కులు పంపిణీ చేయాలని మంత్రి తెలిపారు. మహిళలు, మహిళ అధికారులు, మహిళా సర్పంచులకు ఉత్తములుగా ఎంపిక చేసి వాళ్ళకి సన్మానం చేయాలని మంత్రి ఆదేశించారు. మహిళలు, డ్వాక్రా సంఘాలు, voa లు, సెర్ప్ ఉద్యోగులు అందరినీ భాగస్వాములను చేయండి. అని మంత్రి తెలిపారు.
14న వైద్య ఆరోగ్య దినోత్సవం సందర్భంగా అన్ని ప్రభుత్వ దవాఖానాలలో పండ్ల పంపిణీ చేయాలి. గర్భిణీలకు పౌష్టికాహార కిట్ల పంపిణీ చేపట్టాలి. తొర్రూరు పట్టణంలో బస్తీ దావఖానాలను ప్రారంభించాలి. అన్ని దవాఖానాలలో కెసిఆర్ కిట్లను ప్రదర్శిస్తూ వాటిని బాలింతలకు పంపిణీ చేయాలి అలాగే రాయపర్తి పాలకుర్తి తొర్రూరు గ్రామాల్లో తాను పాల్గొంటానని మంత్రి తెలిపారు.
15న పల్లె ప్రగతి దినోత్సవం సందర్భంగా పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా మన గ్రామాలు బాగుపడ్డ తీరుని వివరించాలి. వివిధ గ్రామాభివృద్ధి సంఘాలను భాగస్వాములను చేయాలి. గ్రామాల్లో వివిధ అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరిస్తూ, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలి. గ్రామ సభలు నిర్వహించాలి. జాతీయ జెండాలు ఎగురవేయాలి. గ్రామంలో జరిగిన అభివృద్ధి మొత్తం సవివరంగా సమాచారం కరపత్రాల ద్వారా తెలపాలి. అన్ని శాఖల వివరాలు అందులో ఉండాలి. పల్లెల అభివృద్ధికి పాటు పడిన పారిశుద్ధ్య కార్మికులను సత్కరించాలి. వారికి బట్టలు, బూట్లు, అప్రాన్, సర్టిఫికేట్లు పంపిణీ చేయాలి. అని మంత్రి వివరించారు. దాతలకు సన్మానం చేయాలని చెప్పారు. కొత్త గ్రామపంచాయతీ భవనాలకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేయాలని తెలిపారు. ఆరోజు తాను రాయపర్తి లో నూతన భవనాలకు శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేస్తానని మంత్రి చెప్పారు.
16వ తేదీన తెలంగాణ పట్టణ ప్రగతి దినోత్సవం సందర్భంగా తొర్రూరు పట్టణంలో ట్రాక్టర్ ట్రాలీ ట్యాంకర్లను అందంగా అలంకరించి ఊరేగించాలని, నాడు – నేడు పట్టణ ప్రగతిపై నివేదికలు ఫోటోలతో కూడిన ప్రదర్శన చేయాలని, ఎల్ఈడి స్క్రీన్లు పెట్టి అభివృద్ధికి సంబంధించిన వివరాలను ప్రజలకు తెలుపాలని, కరపత్రాలు వేసి ప్రజలకు పంచాలని ర్యాలీ నిర్వహించాలని జండా ఆవిష్కరణలు చేయాలని, అదే రోజు సమీకృత మార్కెట్ షాపుల కేటాయింపు నిర్వహించాలని మంత్రి ఎర్రబెల్లి అధికారులకు ప్రజాప్రతినిధులకు ఆదేశించారు. ఈరోజు గ్రామాలను పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచాలని తెలిపారు.
17న తెలంగాణ గిరిజన ఉత్సవం సందర్భంగా సేవాలాల్ కేసీఆర్ ఫోటోలకు పాలాభిషేకాలు చేయాలని 10% రిజర్వేషన్లు బంజారా భవన ఏర్పాటు బంటి అంశాలను ప్రజలకు వివరించాలన్నారు. పాలకుర్తిలో రెండు కోట్లతో నిర్మించనున్న బంజారా భవన్ కు ఆరోజు శంకుస్థాపన చేస్తామని అలాగే తండాలలో గూడాలలో ఏర్పాటు చేసిన కొత్త భవనాలకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేయాలని మంత్రి నిర్ణయించారు.
18న తెలంగాణ మంచినీళ్ల పండుగ రోజున మిషన్ భగీరథ… గతంలో, ప్రస్తుతం ప్రజలకు అర్థం అయ్యే విధంగా చేయాలి. ఊరు అంతా పండుగ చేయాలి. ప్రతి ఇంటికి నల్లాల ద్వారా నీటిని అందిస్తున్న విషయం ప్రజలకు తెలపాలి. ఆరోజు ఫిల్టర్ బెడ్ల దగ్గరకు ప్రజలను, ప్రజాప్రతినిధులను తీసుకెళ్ళి భోజనాలు పెట్టి, నీటిని పరీక్ష చేసి, శుద్ధి చేసిన నీరు ఎందుకు ఆరోగ్యకరమో వివరించాలి. ఆరోజు కెసిఆర్ ఫోటోకు పాలాభిషేకం చేయండి. పాలకుర్తి నియోజకవర్గం ప్రజలను మరిపెడ ఫిల్టర్ బెడ్లు తీసుకెళ్లి చూపించాలని అందుకు తొర్రూరు రాయపర్తి పెద్దవంగర మండలాలకు ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశించారు ఇంటింటిలో నల్లాల దగ్గర మామిడి తోరణాలు కట్టి కొబ్బరికాయలు కొట్టి మిషన్ భగీరథ ట్యాంకుల వద్ద కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకాలు చేయాలని మంత్రి నిర్ణయించారు.
19వ తేదీన తెలంగాణకు హరితోత్సవం సందర్భంగా ప్రభుత్వ కార్యాలయాలు స్కూల్స్ లలో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టాలి వ్యక్తిగతంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రోత్సహించాలి అటవీ పునరుద్ధరణ పై పెరిగిన గ్రీనరీ శాతంపై ప్రజలకు అవగాహన కల్పించాలి. హరిత హారం కింద నాటిన మొక్కలను 98శాతం సంరక్షించుకున్నాం. వాటి ద్వారా 7.7 శాతం గ్రీనరీ పెరిగింది. కాలం అవుతున్నది ప్రజలకు తెలపాలి.
20వ తేదీన తెలంగాణ విద్యా దినోత్సవం సందర్భంగా అన్ని స్కూల్స్ వద్ద జెండా వందనం జరపాలి స్కూల్స్లో విద్యార్థులతో భారీగా ర్యాలీ నిర్వహించాలి గత పదివేలలో విద్యా విధానంలో వచ్చిన మార్పులను విద్యార్థులకు తెలిపాలి. సంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ కవితలు ఉపన్యాస వ్యాసరచన పోటీలు నిర్వహించాలి విజేతలకు బహుమతులు అందించాలి కొత్తగా ఏర్పాటు చేసిన స్కూల్స్ వద్ద పండుగ వాతావరణ నెలకొల్పాలి. నియోజకవర్గంలోని హరిపిరాల, చిట్యాల, గంట్లకుంట, కొడకండ్ల పాలకుర్తి చిన్న బంగార తదితరచోట్ల కస్తూర్బా పాఠశాలలో మన ఊరు మనబడి శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు నిర్వహించాలని మంత్రి తెలిపారు అలాగే ప్రత్యేకంగా పాలకుర్తి కి మంజూరైన డిగ్రీ కాలేజీని ప్రారంభించనున్నట్లు మంత్రి వెల్లడించారు.
21వ తేదీన ఆధ్యాత్మిక దినోత్సవం సందర్భంగా పాలకుర్తి నియోజకవర్గం లో అభివృద్ధి పరిచిన దేవాలయాల ప్రాంగణాల్లో అనేక సంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని మంత్రి ఆదేశించారు. నియోజకవర్గం లోని సన్నూరు, చెన్నూరు వాన కొండయ్య, తిరుమలాయపల్లి, నాంచారి మడూరు, పాలకుర్తి, వల్మీ డి, బమ్మెర వంటి అనేక గ్రామాలలో ని దేవాలయాల వద్ద నిర్వహించవలసిన ఆధ్యాత్మిక కార్యక్రమాలపై మంత్రి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అలాగే నియోజకవర్గంలోని మసీదులు, చర్చిలను అందంగా విద్యుత్ దీపాలతో అలంకరించి ప్రత్యేక ప్రార్థనలు చేయాలని చెప్పారు.
22వ తేదీన అమరుల దీనోత్సవం ఉంటుందని, ఆనాటి అమరులను గుర్తుకు చేసుకుంటూ జిల్లా ఒక యూనిట్ గా ఒకే సమయానికి నివాళులర్పించాలి. దేవరుప్పులలో శ్రీకాంతాచారి విగ్రహానికి రెండు నిమిషాలు మౌనం పాటించాలి గ్రామపంచాయతీలు తొమ్మిది గంటలకు మండల పరిషత్తులకు 10 గంటలకు జిల్లా పరిషత్లకు 11 గంటలకు అలాగే అన్ని ప్రభుత్వ వివిధ మున్సిపాలిటీ సొసైటీలో వద్ద ఈ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించాలని మంత్రి ఆదేశించారు.
ఈ సమీక్షలో జనగామ జిల్లా కలెక్టర్ శివలింగయ్య, డి ఆర్ డి ఓ రాంరెడ్డి ఏపీ డి నూరుద్దీన్, వివిధ శాఖల అధికారులు పంచాయతీ అధికారి ఇంజనీరింగ్ పంచాయతీరాజ్ నీటిపారుదల విద్యా వ్యవసాయ శాఖ పోలీస్ శాఖ విద్యుత్ వైద్య ఆరోగ్యం పారిశ్రామిక రెవిన్యూ డ్వాక్రా గిరిజన వివిధ సంక్షేమ శాఖల అధికారులు ప్రజాప్రతినిధులు నియోజకవర్గ వ్యాప్తంగా నేతలు పాల్గొన్నారు.