కాంగ్రెస్, బిజెపి, బీఆర్ఎస్ పార్టీల మధ్య హోరాహోరీగా పోటీ ఉంటుందనుకున్న వరంగల్ ఎస్సీ పార్లమెంటు సీటును కాంగ్రెస్ పార్టీ కడియం కావ్య రూపంలో బంపర్ మెజారిటీతో గెలుపొంది అందరినీ ఆశ్చర్య చకితుల్ని చేసింది. కౌంటింగ్ ప్రారంభం నుండి అన్ని రౌండ్లలో కడియం కావ్య ఆధిక్యతను ప్రదర్శిస్తూ వచ్చింది.
బిజెపి అభ్యర్థి ఆరోరి రమేష్ రెండో స్థానంలో నిలిచి పోటీ ఇచ్చినప్పటికీ ఆమె రెండు లక్షల 18 వేల 77 ఓట్లు మెజారిటీతో ఆయనపై గెలుపొంది రికార్డ్ సృష్టించింది. అంతేకాకుండా బారాస పార్టీ నుండి పోటీ చేసిన సుధీర్ కుమార్ కౌంటింగ్ ప్రారంభంలోనే తనకు అనుకూలంగా లేని పరిస్థితులను చూసి కౌంటింగ్ కేంద్రం నుండి నిష్క్రమించారు. కడియం కావ్యకు మొత్తం ఐదు లక్షల 73వేల 92 ఓట్లు పోలయ్యాయి. అందులో ఎక్కువగా ఆమె తండ్రి ప్రతినిత్యం వహిస్తున్న స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే అసెంబ్లీ నియోజకవర్గం నుండి 96 వేల 672 ఓట్లు వచ్చాయి. తర్వాత ఆరూరి రమేష్ రెండుసార్లు అత్యధిక మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలుపొందిన నియోజకవర్గమైన వర్ధన్నపేట నుండి 93 వేల 194 ఓట్లు వచ్చాయి. భూపాలపల్లి నియోజకవర్గం నుండి 90 వేల 389 ఓట్లు, ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రతినిత్యం వహించిన పాలకుర్తి నియోజకవర్గం నుండి అనూహ్యంగా 87 వేల 150 ఓట్లు, చల్ల ధర్మారెడ్డి టిఆర్ఎస్ నుండి గెలుపొందిన నియోజకవర్గమైన పర్కాల నుండి 76,232 ఓట్లు, ప్రస్తుత మంత్రి కొండ సురేఖ ప్రాతినిధ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గం నుండి 66వేల 679 ఓట్లు, అతి తక్కువగా వరంగల్ పశ్చిమ నియోజకవర్గం నుండి 63,50086 ఓట్లు మొత్తంగా 5 లక్షల 73 వేల 902 ఓట్లు రాగా అందులో రెండు లక్షల 18 వేల 77 ఓట్లు కడియం కావ్య కు మెజార్టీగా రావడం జరిగింది.
ఈ గెలుపు సందర్భంగా ఆమె మాట్లాడుతూ అతి తక్కువ సమయంలో కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వం అండదండలతో తాను ఎంపీగా గెలిచానని వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ అదేవిధంగా గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలకు కట్టుబడి పని చేస్తానని ఈ సందర్భంగా ఆమె హామీ ఇచ్చారు. ప్రధానంగా భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు, మామునూరు విమానాశ్రయం ఏర్పాటుకు కృషి, నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం, పరిశ్రమలు నెలకొల్పడంలో వంటి వాగ్దానాలను అమలు చేయించడంలో నా వంతు కృషి చేస్తానని ఆమె ధీమా వ్యక్తం చేశారు.
కడియం కావ్య గెలుపు సందర్భంగా వర్ధన్నపేట, స్టేషన్గన్పూర్, పాలకుర్తి, వరంగల్ తూర్పు, పశ్చిమ, పరకాల, భూపాలపల్లి నియోజకవర్గాల ఎమ్మెల్యేలైన కె ఆర్ నాగరాజు, కడియం శ్రీహరి, యశస్విని రెడ్డి, నాయిని రాజేందర్ రెడ్డి, మంత్రి కొండ సురేఖ, గండ్ర సత్యనారాయణ రావులు ఆమెకు కృతజ్ఞతలు తెలిపారు.