Wazeedu SI| తెలంగాణలో సంచలనం సృష్టించిన ములుగు జిల్లా వాజేడు మండలంలోని ఎస్ఐ హరీశ్ ఆత్మహత్య కేసులో నల్లగొండ జిల్లాకు చెందిన ఓ యువతిని పోలీసులు అరెస్ట్ చేశారు. తమ కుమారుడి మృతికి ఆ యువతే కారణమని హరీశ్ తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. దీంతో ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
కాగా సోమవారం ఉదయం ఒక రిసార్ట్‌లో ఎస్‌ఐ రుద్రారపు హరీష్ తన సర్వీస్ రివాల్వర్ తో షూట్ చేసుకుని ప్రాణాలు తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పోలీసుల విచారణలో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి.
ఏడు నెలల కిందట హరీష్‌కు ఓ యువతి ఫోన్ చేయగా మాటామాటా కలిసి ఇద్దరూ క్లోజ్ అయ్యారు. ఈ క్రమంలోనే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే యువతి గురించి ఎస్‌ఐ హరీష్ ఆరా తీయగా.. సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలానికి చెందిన యువతి గతంలో ముగ్గురు యువకులతో స్నేహంగా ఉండేదని తెలిసింది. అందులో ఒకరు పెళ్లికి నిరాకరించడంతో చిలుకూరు పీఎస్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో హరీశ్ ఆమెతో పెళ్లికి ఒప్పుకోలేదు. ఇదే విషయంపై మాట్లాడేందుకు వాజేడు ముళ్లకట్ట సమీపంలోని ఓ రిసార్టుకు ఇద్దరు వెళ్లారు. అక్కడ ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఉన్నతాధికారులకు చెబుతానని బెదిరింపులకు గురిచేయడంతో మనస్తాపానికి గురైన హరీష్ ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.