Kalvakuntla Kavitha: బీఆర్ఎస్ కల్వకుంట్ల కవితను సస్పెండ్ చేసిన మరుసటి రోజే ఎమ్మెల్సీ పదవికీ, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి మరింత సానుభూతి పొందేలా స్కెచ్ వేస్తున్నారు.
బీఆర్ఎస్ నేతలు హరీష్‌రావు, సంతోష్‌రావులే టార్గెట్‌గా బుధవారం మీడియాతో మాట్లాడిన కవిత..చివర్లో వ్యూహాత్మకంగా “జై కేసీఆర్” నినాదాన్ని ఎత్తుకున్నారు. కవిత ఈ నినాదాన్ని కాకతాళీయంగా చేసింది కాదని, , జై కేసీఆర్ అని పార్టీ నుంచి సస్పెండ్ అయిన తరువాత కూడా నినదించడం ద్వారా బీఆర్ఎస్‌లోని అసంతృప్తి వర్గాన్ని తనవైపు తిప్పికొనేందుకు ఆమె వ్యూహాత్మక ఎత్తుగడగా ప్రచారం జరుగుతోంది. కేసీఆర్‌పై గౌరవం ప్రదర్శించడం ద్వారా ఇప్పటికే క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంచార్జ్‌లు, సీనియర్లపై అసంతృప్తితో ఉన్న క్యాడర్‌లో తనపై సానుభూతి పెరిగి కచ్చితంగా తనకు అండగా నిలుస్తారని కవిత భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఇందులో భాగంగానే వ్యూహాత్మకంగా జై కేసీఆర్ నినాదాన్ని ఎత్తుకున్నట్లు కనిపిస్తోంది. బీఆర్ఎస్ పార్టీలో నెలకొన్న రాజకీయ సంక్షోభం, కవిత వ్యూహాత్మ అడుగులు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతోపాటు, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్‌ను తీవ్రంగా దెబ్బతీస్తాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
రెండుగా చీలిన బీఆర్ఎస్ కేడర్
పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న కారణంగా కవితను కేసీఆర్ పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతో జిల్లాల వారీగా బీఆర్‌ఎస్ రెండు వర్గాలుగా చీలిపోయినట్టు కనిపిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో ఒక వర్గం కవితకు మద్దతుగా నిలిస్తుంటే, మరో వర్గం హరీష్ రావు, సంతోష్ రావు వంటి నాయకులకు సంఘీభావంగా నిలుస్తోంది. తద్వారా కల్వకుంట్ల కుటుంబంలోని అంతర్గత గొడవలు కేడర్‌ను పూర్తిగా అయోమయానికి గురి చేసినట్టైంది. ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు జరుగుతున్న ఈ పరిణామాలు బీఆర్ఎస్‌కు కోలుకోలేని నష్టం చేస్తాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కవిత సస్పెన్షన్ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా పోటాపోటీ నిరసనలు జరుగుతున్నాయి. కవిత మద్దతుదారులు, తెలంగాణ జాగృతి శ్రేణులు హరీష్ రావు, సంతోష్ రావు దిష్టిబొమ్మలను దహనం చేస్తూ నిరసనలు తెలుపుతున్నారు. మరోవైపు, హరీష్ రావు మద్దతుదారులు, బీఆర్ఎస్ శ్రేణులు కవిత ఫ్లెక్సీలు, దిష్టిబొమ్మలను తగలబెడుతున్నారు. హుస్నాబాద్ మల్లె చెట్టు చౌరస్తాలో బీఆర్‌ఎస్ నాయకులు ఆందోళన చేపట్టారు. జగిత్యాల, నిజామాబాద్, మెదక్, కరీంనగర్, నల్లగొండ, వరంగల్ వంటి పలు జిల్లాల్లో ఈ నిరసనలు జరిగాయి. ఈ ఘటనలు రెండు వర్గాల మధ్య పెరుగుతున్న వైరాన్ని స్పష్టం చేస్తున్నాయి. మరో వైపు ఇప్పటికే జిల్లాల్లోని బీఆర్ఎస్ కార్యాలయాల్లో ఉన్న కవిత, జాగృతి ప్లెక్సీలను ఎక్కడిక్కడ తొలగిస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ఓటమి, లోక్‌సభ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవలేకపోవడం, కంటోన్మెంట్ ఉపఎన్నికలో సిట్టింగ్ స్థానం కోల్పోవడం, ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కనీసం పోటీ చేయలేని దుస్థితి వంటి పరిణామాలు, బీజేపీలో బీఆర్ఎస్ విలీన ప్రతిపాదనల ప్రచారం, కవిత సస్పెన్షన్ వంటి పరిణామాలు క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్‌కు క్యాడర్‌ను దూరం చేస్తున్నాయి. లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటు బ్యాంకు 16.7 శాతానికి పడిపోవడమే అందుకు నిదర్శనంగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తాజాగా కవిత సస్పెన్షన్‌తో అయోమయంలో ఉన్న క్యాడర్ బీఆర్ఎస్‌కు పూర్తిగా దూరమవుతోందని, ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి ఆ పార్టీ నేతలు జంకుతున్నట్టు తెలుస్తోంది. పోటీ చేసినా ఓటమి తప్పదనే భావనలో బీఆర్ఎస్ నేతలు ఉన్నట్టు కనిపిస్తోంది. కవిత వర్గాలు గ్రామాల్లో తమకు ఖచ్చితంగా నష్టం చేస్తాయనే భావనతో పోటీకి బీఆర్ఎస్ నేతలు వెనకడుగు వేస్తున్నారని సమాచారం.
ALSO READ: https://teluguprabha.net/telangana-news/revanth-reddy-indiramma-houses-kothagudem-brs/
వ్యూహాత్మక ఎత్తుగడలు
కవిత ఇప్పటికే తనదైన శైలిలో స్పందించడం, తనకంటూ ప్రత్యేక వర్గాన్ని ఏర్పరచుకోవడం ప్రారంభించిందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఇది కేవలం వ్యక్తిగత ప్రదర్శన మాత్రమే కాకుండా, పార్టీ లోపల ఉన్న అసమ్మతి వర్గాలకు ధైర్యాన్ని ఇస్తున్నట్లు కనిపిస్తోంది. ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకోవడం ద్వారా కవిత తన రాజకీయ ప్రస్థానాన్ని బీఆర్ఎస్‌లో ఎదుర్కొన్న అవమానాలను జాతీయ స్థాయిలో చర్చల్లో ఉండేలా కవిత వెలిబుచ్చేందుకు ప్రయత్నం చేస్తుందని సమాచారం. ఇప్పటికే, కవిత జాగృతి ద్వారా నియోజకవర్గాలు, మహిళా విభాగం, విద్యార్థి విభాగాలపై ప్రత్యేక దృష్టి పెట్టి, తనకు మద్దతు ఉండేలా బలమైన వర్గాన్ని ఏర్పరుచుకుంటున్నారు. కేసీఆర్, కేటీఆర్ నిర్ణయాలకు ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా ప్రశ్నలు లేవనెత్తడం ద్వారా హరీష్ రావు, సంతోష్‌లపై ఆరోపణలతో పార్టీలో ఏదో తప్పు జరుగుతుందనే భావనను క్రియేట్ చేస్తూ ప్రజల్లో సానూభూతి పొందడం ద్వారా రాజకీయంగా బలీయమైన శక్తిగా కనిపించడంతో పాటు రాజకీయంగా ‘సెంటర్ ఆఫ్ అట్రాక్షన్’ గా నిలవనున్నారు.
ట్రబుల్ షూటర్‌పై ముప్పేట దాడి
ట్రబుల్ షూటర్ హరీష్ రావు పై కవిత ముప్పేట దాడి చేశారు. అయితే, సోమవారం నిర్వహించిన ప్రెస్ మీట్లో హరీష్ రావు వల్లనే కేసీఆర్‌పై సీబీఐ ఎంక్వైయిరీ వేశారని బహిరంగంగానే చెప్పారు. దీనిపై బీఆర్ఎస్ మంగళవారం కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ పరిణామాల నేపథ్యంలో కవిత బుధవారం మీడియా సమావేశంలో ఇది ఊహించని పరిణామం అని పార్టీని డ్యామేజ్ చేస్తున్నారని చెబితే తననను సస్పెండ్ ఎలా చేస్తారని, ఇప్పటికైనా నాన్న, కేసీఆర్, సోదరుడు కేటీఆర్ జాగ్రత్తగా ఉండాలంటూ కవిత భావోద్వేగానికి గురయ్యారు. కేసీఆర్ కు నష్టం చేకూర్చే వారు ఎంతటి వారినైనా వదిలిపెట్టబోననని తేల్చి చెప్పారు.
ALSO READ: https://teluguprabha.net/telangana-news/kalvakuntla-kavitha-resigns/
జూబ్లీహిల్స్ బరిలో కవిత?
ఈ పరిణామాల నేపథ్యంలో తెలంగాణ జాగృతి పేరిట జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికలో పోటీ చేసే ఆలోచనలో కవిత ఉన్నట్టు సమాచారం. తనను తాను నిరూపించుకోవాలనే ఆలోచనలో కవిత ఉన్నట్టు ఆమె సన్నిహితులు చెబుతున్న మాట. ఇప్పటికే, నియోజకవర్గంలో సర్వే సైతం చేయించుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. తెలంగాణ రాజకీయాల్లో కవిత తన స్థానాన్ని నిరూపించుకునేందుకు వ్యూహాత్మకంగా ఈ నియోజకవర్గాన్ని ఎంచుకోవడంతో పాటు రాజకీయ సమీకరణాలు కలిసి వస్తాయని భావిస్తున్నారు. మరో వైపు కేసీఆర్ తనయగా, పార్టీ నుంచి అకారణంగా ఆడబిడ్డను సస్పెండ్ చేయడంతో ఈ సానుభూతి వర్కఅవుట్ అవుతుందని అంచనా వేస్తున్నారు. జూబ్లీహిల్స్ నుంచి పోటీ చేస్తే నగర ప్రజలపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. అదే సమయంలో, ఇది పెద్ద సవాల్ తో కూడుకుని ఉండే అంశం పట్టణ ఓటర్లు సాధారణంగా సాధారణంగా అభివృద్ధి, మౌలిక వసతులు, ట్రాఫిక్ సమస్యలు వంటి అంశాలను ప్రాధాన్యంగా చూస్తారు. అంతేకాకుండా, కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ నుంచి ఈ ఉపఎన్నికల్లో బలమైన అభ్యర్థులు బరిలోకరి దిగే అవకాశం ఉంటుంది. అయనప్పటికీ కవిత పోటీకి దిగితే ఇక్కడ ఉపఎన్నిక హోరాహోరిగా సాగుతుందనడంలో ఏ సందేహం లేదని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. బీఆర్ఎస్‌లో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాల మధ్య, కవిత జూబ్లీహిల్స్ బరిలోకి దిగడం బీఆర్ఎస్ కు మింగుడు పడని అంశం. అంతేకాకుండా ఇది ఆత్మగౌరవ పోరాటానికి సంకేతమని చెప్పకతప్పదు. ఒకవేళ కవిత గెలిస్తే ఆమె ఏంటో నిరూపించుకోవడంతో పాటు రాజకీయంగా బలీయమైన శక్తిగా మారుతుందనడంలో సందేహం లేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అదేసమయంలో ఓడితే, వ్యక్తిగతంగా, రాజకీయంగా కవిత ఇమేజ్ దెబ్బతినడంతో పాటు బీఆర్ఎస్ ఇమేజ్ కూడా దెబ్బతింటుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్న మాట.


