Agriculture WhatsApp: తెలంగాణ వ్యవసాయశాఖ ఎప్పటికప్పుడు అప్‌డేట్లను నేరుగా రైతులకు చేరవేసేందుకు, సమాచార పంపిణీ కోసం గత నెలలో వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. వ్యవసాశాఖ ఆధ్వర్యంలో ఆగస్టు 8న ‘అగ్రికల్చర్ డిపార్టుమెంట్ తెలంగాణ’పేరుతో వాట్సాప్ ఛానల్ ప్రారంభించారు. వ్యవసాయ శాఖ డైరెక్టర్ బి.గోపి పర్యవేక్షణలో వేగంగా ఛానల్‌లో సమాచారం అందిస్తూ.. రైతులకు సమాచారం అందిస్తున్నారు. ఈక్రమంలో నెల రోజులు గడవకముందే దాదాపు 32 వేలకుపైగా మంది రైతులు ఈ ఛానల్‌ను ఫాలో అవుతున్నారు.
వ్యవసాయశాఖ కీలక సమాచారం పంపిణీ
ఈ ఛానెల్ ద్వారా రైతులకు ఎప్పటికప్పుడు సాగులో సలహాలు, సూచనలను వ్యవసాయ శాఖ అందిస్తోంది. ప్రధానంగా వాతావరణ హెచ్చరికలు, పంటల వివరాలు, పురుగు మందులు, ఎరువుల వివరాలు వాట్సాప్ ఛానల్ సమాచారం తెలియజేస్తున్నారు. అంతేకాకుండా రైతులు వాట్సాప్ ఛానల్ ఎలా వినియోగించుకోవాలో ఏఐ వీడియో రూపొందించారు. పంటలకు తెగుళ్లు సోకితే ఏయే మందులు చల్లాలి, ఆపై తీసుకోవాల్సిన రక్షణ చర్యలు తదితర వివరాలను వివరణాత్మకంగా వాట్సాప్ ఛానల్‌లో అందజేస్తున్నారు. రాష్ట్రంలో ప్రధాన పంటగా ఉన్న వరిలో పాము పొడ తెగులు, ఆకుముడత నివారణ కోసం శాస్త్రవేత్తల సూచనల మేరకు చేపట్టాల్సిన చర్యలను వివరంగా షేర్ చేసింది. కంది, మొక్కజొన్నలో కాండం వంటి వాటిని తొలుచే పురుగు కోసం వాడాల్సిన పురుగు మందులు, పత్తిలో జింక్ లోపం సవరణ, పచ్చదోమ నివారణపై ఎలాంటి చర్యలు చేపట్టాలి, ఉద్యాన వనపంటల విషయంలో సవాళ్లు, సమస్యలు ఎదురైతే రైతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని అనే అంశాలను వ్యవసాయ శాఖ అందిస్తోంది. అంతేకాకుండా రైతులకు వ్యవసాయానికి సంబంధించి క్విజ్ పోటీలు సైతం వాట్సాప్ ఛానల్‌లో నిర్వహిస్తున్నారు. దీంతో రైతులను మరింత యాక్టివ్‌గా ఉంచేందుకు చేస్తోన్న ప్రయత్నం.
మరోవైపు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సందేశాన్ని, ప్రెస్ నోట్లు, ప్రెస్ మీట్ల వివరాలు, వీడియో లింక్‌లు ఇలా… అన్ని ఛానల్ ద్వారా చేరవేస్తోంది. రైతులకు సమాచారం ఇవ్వడమే కాకుండా గ్రూప్ డిస్కషన్ కోసం జూమ్ సమావేశాల లింక్‌లను పోస్ట్ చేస్తున్నారు. దీని ద్వారా రైతులు నేరుగా తమ సమస్యలు, పంటల వివరాలు తెలియజేసేందుకు వాట్సాప్ ఛానల్ వేదికైంది.
చీడ, పీడల నుంచి పంటలను రక్షించుకోవడమే గాకుండా వ్యవసాయంలో వస్తున్న ఆధునాతన మార్పులను ఎప్పటికప్పుడు రైతులకు ఈ వాట్సాప్ ఛానల్ ఉపయోగపడనుంది. ఇందులో వ్యవసాయశాఖ మంత్రి నుంచి అధికారులు నిర్వహించే రైతు, వ్యవసాయ సంబంధిత మీటింగులు, లేటెస్ట్ డెవలప్‌మెంట్లు అందుబాటులో ఉంటాయి. రైతులకు వీలైనప్పుడు వీటిని వీక్షించవచ్చు.


