గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ 10 బిల్లులను పెండింగ్ లో పెట్టారంటూ తెలంగాణ చీఫ్ సెక్రెటరీ శాంతికుమారి సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేయటం సంచలనం సృష్టిస్తోంది. దీనిపై రాజకీయాలు ముదిరి పాకాన పడుతుండగా మరోవైపు బీఆర్ఎస్ నేతలంతా గవర్నర్ తీరును ఎండగట్టడంలో బిజీగా ఉన్నారు. ఢిల్లీ కంటే రాజ్ భవన్ దగ్గరగా ఉంటుందని ట్వీట్ ద్వారా సీఎస్ కు గవర్నర్ చురకలంటించటం వైరల్ గా మారింది. ఇప్పటికే హైకోర్టులో ఈ కేసు పెండింగ్ లో ఉండగా గవర్నర్ తరపు లాయర్ మాత్రం త్వరలో సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చినా ఆ బిల్లులు అలాగే పెండింగ్ లో ఉండిపోవటంపై రాష్ట్ర ప్రభుత్వం న్యాయపోరాటానికి దిగింది.
మరోవైపు తాజాగా గవర్నర్ తమిళసై పై మంత్రి జగదీష్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. రాజ్ భవన్ పైరవీలకు కేంద్రంగా మారకూడదని, తెలంగాణా బిల్లుల ఆమోదానికి ప్రభుత్వం న్యాయపరంగా ముందుకు పోతుందని జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు. రాజకీయ ఉద్దేశ్యంతోటే తెలంగాణా బిల్లుల మీద సంతకాలు పెట్టలేదని, తెలంగాణా అభివృద్ధి ని అడ్డుకునేందుకే గవర్నర్ చర్యలున్నాయంటూ నల్లగొండలో మీడియాతో మంత్రి జగదీష్ రెడ్డి ఆరోపించారు.