WhatsApp group alert leads recovery of a stolen vehicle in Hyd : వాట్సాప్… మన దృష్టిలో అదొక సందేశాల వేదిక. గుడ్ మార్నింగ్ మెసేజ్‌ల నుంచి ఫన్నీ వీడియోల వరకు, స్నేహితులతో కబుర్లకు, బంధువులతో పలకరింపులకు వాడుకునే ఒక సాధారణ యాప్. కానీ, అదే వాట్సాప్‌ను ఒక ఆయుధంగా మార్చి, కేవలం గంటన్నర వ్యవధిలోనే ఒక దొంగను పట్టుకుని, చోరీకి గురైన వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారంటే నమ్ముతారా..? హైదరాబాద్ నగరంలో జరిగిన ఈ ఘటన, సోషల్ మీడియా శక్తిని, సామాజిక చైతన్యాన్ని కళ్లకు కట్టింది. అసలు ఆ ఆటో ఎలా దొంగిలించబడింది..? ఒక వాట్సాప్ మెసేజ్, దొంగను ఎలా పట్టించింది..?
ఇంటి ముందు ఆటో మాయం.. బాధితుడి ఆవేదన : ఝార్ఖండ్‌కు చెందిన బిపిన్‌రాజ్ యాదవ్, బతుకుదెరువు కోసం హైదరాబాద్ వచ్చి బొల్లారం ప్రాంతంలో నివాసముంటూ ఆటో నడుపుకుంటున్నాడు. రోజూలాగే ఆదివారం రాత్రి తన ఇంటి ముందు ఆటోను పార్క్ చేసి నిద్రపోయాడు. సోమవారం ఉదయం లేచి చూసేసరికి ఆటో కనిపించలేదు. జీవనాధారమైన ఆటో పోవడంతో అతను తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. వెంటనే సమీపంలోని సీసీ కెమెరా ఫుటేజీని పరిశీలించగా, రాత్రి 2 గంటల సమయంలో ఓ వ్యక్తి తన ఆటోను దొంగిలించుకుని వెళ్తున్న దృశ్యాలు కనిపించాయి.
వాట్సాప్ గ్రూప్‌లో ‘అలర్ట్’.. గొలుసుకట్టు : వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసే బదులు, బిపిన్‌రాజ్ ఒక తెలివైన పనిచేశాడు. అతను తన ఆటో ఫోటోను, సీసీ కెమెరా ఫుటేజీని తను సభ్యుడిగా ఉన్న ‘ఝార్ఖండ్ ఏక్తా సమాజ్’ అనే వాట్సాప్ గ్రూప్‌లో పోస్ట్ చేశాడు. ఆ గ్రూపు సభ్యులు ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ సమాచారాన్ని తమకు తెలిసిన ఇతర గ్రూపులకు ఫార్వార్డ్ చేశారు. అలా, ఆ దొంగిలించబడిన ఆటో సమాచారం వాట్సాప్ గొలుసుకట్టు ద్వారా నగరం నలుమూలలకు వేగంగా వ్యాపించింది.
రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిన దొంగ : ఆటో పోయిన కొన్ని గంటల తర్వాత, ఉదయం 11:30 గంటల సమయంలో అద్భుతం జరిగింది. బంజారాహిల్స్ రోడ్ నంబర్-10లోని స్టార్ ఆసుపత్రి సమీపంలో, ‘ఝార్ఖండ్ ఏక్తా సమాజ్’ గ్రూప్ సభ్యుడైన కల్లుకుమార్ తన ఆటోను పార్క్ చేస్తుండగా, పక్కనే చోరీకి గురైన ఆటో కనిపించింది. దాన్ని గమనించడమే కాదు, ఆ ఆటోకు ఉన్న స్టిక్కర్లను ఓ వ్యక్తి తొలగిస్తూ కనిపించాడు. ఇది చూసి అనుమానం వచ్చిన కల్లుకుమార్, వెంటనే ఆ దృశ్యాన్ని తన ఫోన్‌లో వీడియో తీసి మళ్లీ అదే వాట్సాప్ గ్రూప్‌లో పోస్ట్ చేశాడు.
ఆ వీడియో చూసిన గ్రూపులోని సమీప సభ్యులు క్షణాల్లో అక్కడికి చేరుకున్నారు. ఆ దొంగను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని, బంజారాహిల్స్ పోలీసులకు అప్పగించారు. పోలీసుల విచారణలో నిందితుడు జీడిమెట్లకు చెందిన రోహిత్ అని తేలింది. ఈ ఘటనతో, సోషల్ మీడియాను సరైన రీతిలో ఉపయోగిస్తే ఎంతటి అద్భుతాలు చేయవచ్చో రుజువైంది. గ్రూప్ సభ్యుల చైతన్యాన్ని, సమయస్ఫూర్తిని పోలీసులు ప్రత్యేకంగా అభినందించారు.


