Komatireddy Rajagopal Reddy: రీజినల్ రింగ్ రోడ్డు (RRR) భూనిర్వాసితులకు అండగా ఉంటానని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి హామీ ఇచ్చారు. ఆదివారం యాదాద్రి భువనగిరి జిల్లాలోని సంస్థాన్ నారాయణపురం మండలంలో జరిగిన భూనిర్వాసితుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చౌటుప్పల్ డివిజన్‌లోని ఉత్తర భాగం రైతులు RRR అలైన్‌మెంట్ మార్పు వల్ల తీవ్రంగా నష్టపోయారని, న్యాయం కోసం వారు దిల్లీలో కూడా పెద్దలను కలిసినా ప్రయోజనం లేకపోయిందని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఒక కంపెనీ కోసం అలైన్‌మెంట్ మార్చారని ఆయన ఆరోపించారు. ఇప్పుడు దక్షిణ భాగంలో అలైన్‌మెంట్ మార్పు కావాలంటే ఉత్తర భాగం కూడా మారాల్సి ఉంటుందని, ఉత్తర భాగం మారాలంటే ప్రభుత్వమే మారాలేమోనని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
తనకు వ్యక్తిగతంగా అన్యాయం జరిగినా భరిస్తానని, కానీ ప్రజలకు అన్యాయం జరిగితే పోరాటానికి వెనుకాడనని రాజగోపాల్‌రెడ్డి స్పష్టం చేశారు. అవసరమైతే RRR ప్రాజెక్ట్ రద్దయినా సరే, భూములు కోల్పోతున్న వారికి అన్యాయం జరగనివ్వనని భరోసా ఇచ్చారు. తమ సమస్యకు పరిష్కారం లభించాలంటే ప్రభుత్వాన్ని స్తంభింపజేయడం ఒక్కటే మార్గమని సూచించారు.
మునుగోడు నియోజకవర్గంలోనే ఎక్కువ మంది రైతులు తమ భూములను కోల్పోతున్నారని, ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో పాటు అవసరమైతే కేంద్ర మంత్రులను కూడా కలుస్తానని ఆయన తెలిపారు. తాను అధికార పార్టీ ఎమ్మెల్యేనైనప్పటికీ, ప్రజలకు అన్యాయం జరిగితే ప్రభుత్వంతో పోరాడటానికి సిద్ధంగా ఉన్నానని, ఎలాంటి త్యాగానికైనా సిద్ధమని చెప్పారు. తనపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని వమ్ము చేయబోనని, భూమికి, రైతుకు ఉన్న భావోద్వేగ బంధం తనకు తెలుసని ఆయన అన్నారు. ప్రజలకు న్యాయం జరిగేంత వరకు వారితో కలిసి పోరాడుతానని రాజగోపాల్‌రెడ్డి పునరుద్ఘాటించారు. ఈ సమావేశంలో వివిధ పార్టీల నాయకులు, భూనిర్వాసితులు పాల్గొన్నారు.


