తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు(Telangana Assembly) వాడివేడిగా సాగుతున్నాయి. రైతు భరోసాపై చర్చ సందర్భంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ సభ్యుల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) మాట్లాడుతూ.. ఏ గ్రామంలోనైనా రైతులకు వంద శాతం రుణమాఫీ జరిగిందని నిరూపిస్తే రాజీనామాకు సిద్ధమని సవాల్ విసిరారు. తక్షణమే స్పీకర్ ఫార్మాట్‌లో రాజీనామా చేసి రాజకీయ సన్యాసం తీసుకుంటానని స్పష్టం చేశారు. కొడంగల్, కొండారెడ్డి పల్లి, సిరిసిల్ల ఇలా ఎక్కడైనా వెళ్దామని.. పూర్తి రుణమాఫీ చేసినట్లు నిరూపించాలన్నారు.
రాష్ట్రంలో పాన్ కార్డులు ఉన్న అందరికీ రైతు భరోసా ఇవ్వకుంటే ఎలా అని ఆయన ప్రశ్నించారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగులకు భూమితో ఉన్న సంబంధం తెంచేస్తారా..? అని నిలదీశారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు బంధును పశ్చిమ బెంగాల్, ఒడిశా వంటి రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకున్నాయని తెలిపారు. అలాగే కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కిసాన్ స్కీమ్ కూడా ఈ పథకం చూసి కాపీ కొట్టారని ఆరోపించారు. కాంగ్రెస్ వస్తే మార్పు అన్నారని.. మార్పు అంటే పథకాలకు కేవలం పేరు మార్చడమా అని విమర్శించారు.