Weather Forecast Update: కుండపోత వర్షాలతో అల్లకల్లోలం అవుతున్న తెలుగు రాష్ట్రాలకు భారీ ఊరట లభించింది. దక్షిణ ఒడిశా-గోపాల్‌పూర్ సమీపంలో వాయుగుండం తీరం దాటిందని అధికారులు తెలిపారు. ఇది పశ్చిమ దిశగా ఛత్తీస్‌గఢ్ వైపు కదిలి బలహీనపడనుందని పేర్కొన్నారు. అయినప్పటికీ తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిశా అప్రమత్తంగా ఉండాలని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. మహారాష్ట్రకు కూడా భారీ వర్ష సూచనలున్న నేపథ్యంలో.. కృష్ణా, గోదావరి నదుల్లో భారీగా నీరు చేరే అవకాశం ఉందని పేర్కొన్నారు.
ప్రకృతి ప్రకోపం: గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ నుంచి అతి భారీ వర్షాలు రాష్ట్రంలో జనజీవనాన్ని పూర్తిగా స్తంభింపజేశాయి. ముఖ్యంగా హైదరాబాద్‌లో మూసీ నది ఉగ్రరూపం దాల్చడంతో నగరవాసులు వణికిపోతున్నారు. దీంతో నగరంతో పాటుగా రాష్ట్రవ్యాప్తంగా వాతావరణ శాఖ రెడ్ అలర్ట్‌ను ప్రకటించారు. రాబోయే రెండు రోజులు మరింత ప్రమాదకరమైన వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. 45ఏళ్లలో ఎన్నడూ చూడని విధంగా వరద ప్రవాహం పెరగడంతో నగరంలోని కీలక ప్రాంతాలు నీట మునిగాయి. చాదర్‌ఘాట్‌లోని లోలెవల్ వంతెన పైనుంచి ఏకంగా ఆరు అడుగుల మేర వరద నీరు ప్రవహిస్తుంది. ఇక మూసారాంబాగ్‌లో వంతెనపై నుంచి 10 అడుగుల ఎత్తులో వరద ప్రవహించడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఈ వరద కారణంగా ఎంజీబీఎస్ (మహాత్మాగాంధీ బస్‌స్టాండ్)లోకి నీరు చేరింది. దీంతో ఎంజీబీఎస్‌లోకి వెళ్లే రెండు బ్రిడ్జిలు పూర్తిగా నీట మునిగాయి.వరద ఉధృతి ఎక్కువగా ఉండటంతో ప్రయాణికులు బయటికి రాలేక లోపలే ఉండిపోయారు. దీంతో సీఎం రేవంత్‌రెడ్డి వెంటనే అధికారులను అప్రమత్తం చేశారు. చిక్కుకుపోయిన ప్రయాణికులను సురక్షితంగా బయటికి తీసుకురావాలని ఆదేశించారు. మున్సిపల్ హైడ్రా డీఆర్ఎఫ్ (DRF) బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. ఒక్కొక్కరిని చేతులు పట్టుకొని బయటికి తీసుకురావడానికి ప్రయత్నాలు ముమ్మరం చేశాయి.
Also Read:https://teluguprabha.net/telangana-news/amberpet-musherambagh-bridge-closed-due-to-heavy-rains/
అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు: ఈ రోజు వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. నిర్మల్, నిజామాబాద్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, సిద్దిపేట, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్‌కర్నూల్ జిల్లాలలో అక్కడక్కడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాలలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ అధికారులు తెలిపారు.
పొంగుతున్న వాగులు, నదులు: తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటికే విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో చాలాచోట్ల వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. గోదావరి, కృష్ణా నదులతో పాటుగా మూసీ నదికి వరద ఉధృతి పెరుగుతోంది. హైదరాబాద్ నగరంలో శుక్రవారం రోజంతా భారీ వర్షం కురిసింది. వాయువ్య మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారడంతో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. నైరుతి రుతుపవనాల సీజన్‌లో శుక్రవారం నాటికి రాష్ట్రంలో సగటున 72.33 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా.. 95.06 సెంటీమీటర్ల వర్షం కురిసిందని వాతావరణ అధికారులు తెలిపారు.


