Wine Shops Closed: తెలంగాణలో బోనాల పండుగ వేడుకలు అంగరంగ వైభవం జరుగుతున్నాయి. అమ్మవార్లకు భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో బోనాలు సమర్పిస్తున్నారు. ఎంతో ప్రాముఖ్యత కలిగిన సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల వేడుకలు జులై 14న ఘనంగా జరగనున్నాయి. ఉజ్జయిని మహంకాళి ఆలయంలో జరిగే భవిష్యవాణి కార్యక్రమం ముఖ్యమైన ఘట్టంగా ఉంటుంది. మాతంగి రూపంలో అమ్మవారు ఈ ఏడాది భవిష్యత్తు చెబుతారని భక్తుల విశ్వాసం. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా సికింద్రాబాద్ పరిధిలోని మద్యం షాపులు రెండు రోజుల పాటు మూతపడనున్నాయి.
సెంట్రల్, నార్త్, ఈస్ట్ జోన్‌ల పరిధిలో ఉన్నమద్యం దుకాణాలను మూసివేయాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ కీలక ఆదేశాలు జారీ చేశారు. సీపీ ఆదేశాల ప్రకారం వారాసిగూడ, బేగంపేట, గోపాలపురం, లాలాగూడ, తుకారంగేట్, మారేడ్‌పల్లి, గాంధీనగర్, చిలకలగూడ, మహంకాళి, రామ్‌గోపాల్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న అన్ని వైన్ షాపులు, బార్లు, పబ్బులు మూతపడనున్నాయి. జులై 13 ఉదయం 6 గంటల నుండి జులై 15 ఉదయం 10 గంటల వరకు మద్యం అమ్మకాలను నిలిపివేయాలని ఆదేశించారు. ఎవరైనా పోలీసుల ఆదేశాలు ఉల్లంఘించి షాపులు తెరిస్తే లైసెన్స్ రద్దు చేయడంతో పాటు కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Also Read: లష్కర్ బోనాలు: తెలంగాణ సంస్కృతి, చరిత్రల సంగమం
ఇదిలా ఉంటే జంట నగరాల్లో బోనాల ఉత్సవాలు నెల రోజులపాటు భక్తి శ్రద్ధలు, మేలతాళాలతో ఘనంగా కొనసాగుతాయి. గోల్కొండ, లాల్ దర్వాజ, ఉజ్జయిని మహంకాళి ఆలయాల్లో వేడుకలను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటుచేస్తారు. ఇందులో భాగంగానే మద్యం షాపులను మూసివేయిస్తారు. అలాగే ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా పటిష్ట చర్యలు చేపడతారు. డ్రోన్ల ద్వారా ప్రత్యేక నిఘా పెట్టి అణుఅణువు క్షుణ్ణంగా పరిశీలిస్తారు. సికింద్రాబాద్ పరిధిలో దాదాపు 10వేల మంది పోలీసులను మోహరించనున్నారు. అన్ని విభాగాల అధికారులతో సమన్వయం చేసుకుంటూ భద్రతా చర్యలు చేపట్టనున్నారు.


