Wines Close In Jubilee Hills By Election Polling And Results Day: జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉప ఎన్నికల ప్రచారం నేటి సాయంత్రంతో ముగిసింది. దీంతో, సాయంత్రం 6 గంటల నుంచి ఆ ప్రాంతలో 144 సెక్షన్ అమల్లోకి వచ్చినట్లు రాష్ట్ర ఎన్నికల కమిషన్ వెల్లడించింది. అలాగే ఈరోజు (నవంబర్ 9) సాయంత్రం 6 గంటల నుంచి 11వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు జూబ్లీహిల్స్ పరిధిలో వైన్స్, బార్లు, పబ్బులు, కల్లుదుకాణాలు మూసివేయాలని ఆదేశించింది. నవంబర్ 14న కౌంటింగ్ రోజున కూడా ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా వీటిని బంద్ చేయాలని వైన్స్, బార్ షాపు యాజమాన్యాలకు సూచించింది. కాగా, జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మొత్తం 407 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయని.. ఇందులో 226 క్రిటికల్ పోలింగ్ స్టేషన్లు ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు. పోలింగ్‌ను డ్రోన్ల ద్వారా పరిశీలిస్తామని.. ఈసారి 4 బ్యాలెట్ యూనిట్లు వినియోగిస్తున్నామని తెలిపారు. 2060 మంది పోలింగ్ సిబ్బంది విధుల్లో ఉండనున్నట్లు పేర్కొంది. 561 కంట్రోల్ యూనిట్లు, 595 వీవీ ప్యాట్లు, అలాగే 2,394 బ్యాలెట్ యూనిట్లు ఉన్నట్లు పేర్కొన్నారు. అంతేకాదు, పోలింగ్ స్టేషన్ల నుంచి వెబ్ కాస్టింగ్ లైవ్ స్ట్రీమింగ్ ఉంటుందని తెలిపారు. సీఐఎస్‌ఎఫ్ నుంచి 8 కంపెనీల బలగాలు వచ్చినట్లు పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. మరోవైపు ఈ ఎన్నికల సందర్భంగా మొత్తం 27 రకాల కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం వీటిపై దర్యాప్తు కొనసాగుతోందన్నారు. అలాగే ఇప్పటిదాకా రూ.3 కోట్ల 60 లక్షల నగదును పట్టుకున్నామని స్పష్టం చేశారు.
ఓటర్లను ఆకట్టుకునేలా ప్రలోభాల పర్వం..
మరోవైపు, హైదరాబాద్ నగరంలో సెలబ్రెటీలు, రాజకీయ ప్రముఖులు, బడా వ్యాపారులకు కేరాఫ్ అడ్రస్‌గా చెప్పుకునే జూబ్లీహిల్స్ ఉపఎన్నిక చాలా ఖరీదుగా మారిందని వార్తలు వెలువడుతున్నాయి. ప్రధానంగా ఇందులో విజయం సాధించాలని అధికార కాంగ్రెస్ పార్టీ ఉవ్విళ్లూరుతుండగా.. సిట్టింగ్ సీటును ఎలాగైనా నిలుపుకోవాలని బీఆర్ఎస్ పార్టీ పావులు కదుపుతోంది. ఇక, హైదరాబాద్‌లో తనకున్న పట్టు నిరూపించుకునేందుకు బీజేపీ అన్ని ప్రయత్నాలు చేస్తోంది. దీంతో అన్ని ప్రధాన పార్టీలు ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉపఎన్నికపైనే ఫోకస్ పెట్టాయి. అందుకే ఎంత ఖర్చు అయినా సరే తగ్గేదే లే అంటూ పోటీలు పడి డబ్బులు కుమ్మరిస్తున్నారు. నామినేషన్ దాఖలు చేసినప్పటి నుంచి పోలింగ్ ముగిసేవరకు బరిలో నిలిచిన 3 ప్రధాన పార్టీలు సుమారు రూ.300 కోట్ల వరకు ఖర్చు చేయొచ్చని రాజకీయ విశ్లేషకులు ఇప్పటికే అంచనా వేశారు. ఇక పోల్ మేనేజ్‌మెంట్ కోసం కూడా అన్ని పార్టీలు పక్కాగా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. జూబ్లీహిల్స్‌లో ఒక్కో ఓటుకు రూ. 2 వేల నుంచి రూ.3 వేల వరకు ఇచ్చేందుకు ప్రధాన పార్టీలు ఏర్పాట్లు చేసుకున్నట్టు చర్చ జరుగుతోంది. ఈ క్రమంలోనే మద్యం ప్రలోభాలను అరికట్టేందుకు ఎక్సైజ్ శాఖ అధికారులు తాజా నిర్ణయం తీసుకున్నారు. అయినప్పటికీ, ప్రలోభాల పర్వం కొనసాగుతోన్నట్లు తెలుస్తోంది. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ ప్రధాన పార్టీలు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేయనున్నట్లు సమాచారం.


