Telangana free bus scheme controversy : మహాలక్ష్మి పథకం ఆర్టీసీకి లాభాల సిరులు కురిపిస్తుంటే, క్షేత్రస్థాయిలో మాత్రం కొన్ని విచిత్ర ఘటనలకు కారణమవుతోంది. ఉచిత బస్సు ప్రయాణం కోసం ఆధార్ కార్డు చూపించమన్నందుకు ఓ మహిళ నడిరోడ్డుపై నానా హంగామా సృష్టించింది. కండక్టర్‌తో వాగ్వాదానికి దిగి, తనను బస్సు నుంచి దించేశారన్న కోపంతో ఏకంగా బస్సు కింద పడుకుని బీభత్సం చేసింది. అసలు ఆమె ఎందుకిలా ప్రవర్తించింది…? ఈ ఘటన ఎక్కడ జరిగింది..?
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించడం ఆర్టీసీకి కాసుల వర్షం కురిపిస్తోంది. అయితే, ఈ పథకాన్ని వినియోగించుకునే క్రమంలో కొందరు ప్రయాణికుల ప్రవర్తన సిబ్బందికి తలనొప్పిగా మారుతోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలంలో జరిగిన ఘటనే ఇందుకు నిదర్శనం. మద్యం మత్తులో ఉన్న ఓ మహిళ, ఉచిత టికెట్ కోసం ఆధార్ అడిగినందుకు కండక్టర్‌పై విరుచుకుపడి, బస్సు కింద పడుకుని హల్‌చల్ చేసింది.
స్థానిక ఎస్సై రవికుమార్ తెలిపిన వివరాల ప్రకారం, లక్ష్మీదేవిపల్లి మండలం శేషగిరినగర్‌కు చెందిన బోయ చిట్టి (36) అనే మహిళ మద్యం తాగి కొత్తగూడెం బస్టాండ్‌లో ఖమ్మం వెళ్లే బస్సు ఎక్కింది. మహాలక్ష్మి పథకం కింద జీరో టికెట్ జారీ చేసేందుకు కండక్టర్ ఆమెను ఆధార్ కార్డు చూపించమని కోరారు. అయితే, తన వద్ద ఆధార్ కార్డు లేదంటూ ఆమె కండక్టర్‌తో వాగ్వాదానికి దిగి, పెద్దగా అరవడం మొదలుపెట్టింది. ఆమె ప్రవర్తనతో విసిగిపోయిన కండక్టర్, బస్సు విద్యానగర్ చేరుకోగానే ఆమెను కిందకు దించేశారు.
బస్సు కింద పడుకుని బీభత్సం: తనను బస్సు నుంచి దించేయడంతో తీవ్ర ఆగ్రహానికి గురైన చిట్టి, ఊగిపోతూ “నన్నే దించేస్తారా?” అంటూ బస్సు ముందు చక్రాల కింద అడ్డంగా పడుకుంది. అరుపులు, కేకలతో నడిరోడ్డుపై బీభత్సం సృష్టించింది. దీంతో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. చేసేదేమీ లేక ఆర్టీసీ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, ఆమెను అతి కష్టం మీద పక్కకు తీసి, పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అనంతరం ఆమె కుటుంబ సభ్యులను పిలిపించి, కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు. మద్యం తాగి ప్రజా రవాణాకు, సిబ్బందికి ఆటంకం కలిగిస్తే చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.
లాభాల బాటలో ఆర్టీసీ: మహాలక్ష్మి పథకం ప్రారంభమయ్యాక ఆర్టీసీ బస్సుల్లో మహిళా ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ప్రస్తుతం ప్రతి ముగ్గురు ప్రయాణికుల్లో ఇద్దరు మహిళలే ఉంటున్నారు. పథకం అమలుకు ముందు రోజువారీ సగటు ప్రయాణికుల సంఖ్య 45.49 లక్షలు ఉండగా, ఇప్పుడు అది 59.10 లక్షలకు చేరింది. బస్సుల్లో ఆక్యుపెన్సీ రేషియో 69% నుంచి ఏకంగా 94%కి పెరగడంతో, ఆర్టీసీ వరుసగా రెండు ఆర్థిక సంవత్సరాల్లో లాభాలను నమోదు చేసింది. 2023-24లో రూ.104.11 కోట్లు, 2024-25లో జనవరి నాటికే రూ.529.20 కోట్ల లాభాలు ఆర్జించడం విశేషం. ఈ పథకం ద్వారా అయ్యే ఛార్జీలను ప్రభుత్వమే నేరుగా ఆర్టీసీకి చెల్లిస్తోంది.


