Woman Won by one Vote: తెలంగాణలో పంచాయతీ ఎన్నికల రెండో విడత పోలింగ్ నేడు పూర్తయింది. ఇక సర్పంచ్‌లు, వార్డు మెంబర్లుగా పోటీ చేసిన అభ్యర్థుల భవితవ్యం కూడా తేలింది. కొన్ని గ్రామాల్లో సర్పంచ్‌ల మధ్య పోటీ హోరాహోరీగా సాగింది. నువ్వా నేనా అన్నట్లుగా చివరి వరకూ ఉత్కంఠగా సాగిన ఎన్నికల కౌంటింగ్‌లో స్వల్ప ఓట్ల తేడాతో అభ్యర్థులు గెలుపోటములు చవిచూశారు. మరికొన్ని గ్రామాల్లో అభ్యర్థులకి సమాన ఓట్లు రావడంతో డ్రా ద్వారా సర్పంచ్‌ను ఎన్నుకున్నారు. ఈ క్రమంలో వికారాబాద్ జిల్లాలో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి ఒక్క ఓటు ఆధిక్యంతో విజయం సాధించారు.
Also Read: https://teluguprabha.net/telangana-news/sarpanch-post-won-in-a-draw-in-medak-district/
వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం రాంపూర్ గ్రామంలో కాంగ్రెస్ బలపరిచిన గొల్ల రమాదేవిని ఒక్క ఓటు తేడాతో సర్పంచ్ పదవి వరించింది. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం మౌలాన్ ఖేడ్ సర్పంచ్‌గా చంద్రశేఖర్ అనే అభ్యర్థి రెండు ఓట్ల తేడాతో గెలుపొందారు. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం కూచిపూడి తండాలో కాంగ్రెస్ మద్దతుదారు హజీనాయక్ ఐదు ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఇక, నిజామాబాద్ జిల్లాలోని మోపాల్ మండలం, కులస్పూర్ తండాలో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి లలితా భాయి కూడా 5 ఓట్ల తేడాతోనే ప్రత్యర్థిపై గెలుపొందారు.
మరోవైపు మెదక్ జిల్లా చీపురుదుబ్బ తండా సర్పంచ్‌గా కేతావత్ సునీత డ్రాలో విజయం సాధించారు. ఈ గ్రామంలో మొత్తం 377 ఓట్లు ఉండగా 367 ఓట్లు పోలయ్యాయి. కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థి సునీత, బీఆర్‌ఎస్ బలపర్చిన అభ్యర్థి బీమిలి ఇద్దరికీ 182 చొప్పున సమానంగా ఓట్లు వచ్చాయి. రెండు ఓట్లు చెల్లనివి, ఒకటి నోటాకు పడింది. ఇద్దరికీ సమానంగా ఓట్లు రావడంతో రిటర్నింగ్ ఆఫీసర్ వెంకటయ్య డ్రా తీశారు. కాంగ్రెస్ బలపరిచిన మహిళా అభ్యర్థి కేతావత్ సునీతను విజయం వరించింది.
కాగా, ఇప్పటివరకూ వెలువడిన ఫలితాల్లో అత్యధికంగా కాంగ్రెస్ మద్దతుదారులు విజయం సాధించారు. ఆ తర్వాత స్వతంత్ర అభ్యర్థులు సర్పంచ్‌లుగా గెలుపొందారు. ప్రతిపక్ష బీఆర్‌ఎస్, బీజేపీ బలపరిచిన అభ్యర్థుల కంటే ఇండిపెండెంట్ అభ్యర్థులను ఓటర్లు గెలిపించడం ఆసక్తికరంగా మారింది.

