Women in Indian Police Service : కఠినమైన సవాళ్లను ఛేదించడంలో, శాంతిభద్రతల పరిరక్షణలో మేమూ సైరన్ మోగిస్తామంటూ యువతులు ఖాకీ వైపు పరుగులు పెడుతున్నారు. ఒకప్పుడు పురుషాధిపత్య రంగంగా భావించిన ఇండియన్ పోలీస్ సర్వీస్ (ఐపీఎస్)లో ఇప్పుడు మహిళల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. హైదరాబాద్‌లోని సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ జాతీయ పోలీసు అకాడమీలో శిక్షణ పూర్తి చేసుకున్న 77వ బ్యాచ్, ఈ మార్పునకు సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది. భారత పోలీస్ సర్వీస్ చరిత్రలోనే ఇది ఒక రికార్డుగా నిలుస్తోంది. అసలు ఈ మార్పునకు కారణాలేంటి…? శిక్షణలో అమ్మాయిలు ఎలా రాణిస్తున్నారు…? తెలుగు రాష్ట్రాల నుంచి ప్రాతినిధ్యం ఎలా ఉంది..?
హైదరాబాద్‌లోని జాతీయ పోలీసు అకాడమీ (NPA)లో 77వ రెగ్యులర్ రిక్రూట్ (ఆర్ఆర్) బ్యాచ్ ప్రాథమిక శిక్షణను పూర్తి చేసుకుంది. ఈ బ్యాచ్‌లో మొత్తం 174 మంది ప్రొబేషనర్లు ఉండగా, వారిలో 62 మంది యువతులే కావడం విశేషం. ఐపీఎస్ చరిత్రలో ఒకే బ్యాచ్‌లో ఇంతమంది మహిళలు శిక్షణ పొందడం ఇదే ప్రథమం. 73వ ఆర్ఆర్ బ్యాచ్‌లో 20.66 శాతంగా ఉన్న మహిళల సంఖ్య, ఈసారి ఏకంగా 35 శాతానికి పైగా పెరిగింది. వీరంతా త్వరలో క్షేత్రస్థాయిలో ఆచరణాత్మక శిక్షణ కోసం వివిధ జిల్లాలకు వెళ్లనున్నారు. ఈ నెల 17న అకాడమీలో జరగనున్న ప్రతిష్టాత్మక ‘దీక్షాంత్ పరేడ్’కు బీఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ దల్జీత్‌సింగ్ చౌధరి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ పరేడ్‌కు తమిళనాడు కేడర్‌కు చెందిన అంజిత్ ఎ. నాయర్ కమాండర్‌గా వ్యవహరించనున్నారు. ఈ వివరాలను ఎన్‌పీఏ డైరెక్టర్ అమిత్ గార్గ్ బుధవారం మీడియాకు వెల్లడించారు.
మారుతున్న విద్యా నేపథ్యం: గత కొన్నేళ్లుగా ఐపీఎస్‌కు ఎంపికవుతున్న వారి విద్యా నేపథ్యం కూడా మారుతోంది. ఇంజినీరింగ్ అభ్యర్థుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతుండగా, సైన్స్ నేపథ్యం ఉన్నవారి సంఖ్య పెరుగుతోంది. గతంలో 73వ బ్యాచ్‌లో 68 మంది ఇంజినీర్లు ఉండగా, ఈసారి ఆ సంఖ్య తగ్గింది. అదే సమయంలో, గతంలో 10 మంది మాత్రమే ఉన్న సైన్స్ అభ్యర్థుల సంఖ్య, ఈ బ్యాచ్‌లో 21కి పెరిగింది. తాజా బ్యాచ్‌లో వివిధ నేపథ్యాల నుంచి వచ్చిన వారు
ఇంజినీరింగ్: 86
సైన్స్: 36
ఆర్ట్స్: 29
కామర్స్: 8
ఎంబీబీఎస్: 8
లా: 6
ప్రాంతాల వారీగా ప్రాతినిధ్యం: ఈసారి అత్యధికంగా ఉత్తరప్రదేశ్ నుంచి 35 మంది ఐపీఎస్‌కు ఎంపికయ్యారు. ఆ తర్వాత రాజస్థాన్, మహారాష్ట్రల నుంచి 19 మంది చొప్పున ఉన్నారు. అయితే, తెలుగు రాష్ట్రాల నుంచి ప్రాతినిధ్యం తక్కువగా ఉండటం గమనార్హం. తెలంగాణ నుంచి కేవలం ఇద్దరు, ఆంధ్రప్రదేశ్ నుంచి ఐదుగురు మాత్రమే ఎంపికయ్యారు. మరోవైపు, భూటాన్ నుంచి ఆరుగురు, నేపాల్, మాల్దీవుల నుంచి ఐదుగురు చొప్పున విదేశీ అధికారులు కూడా శిక్షణ పొందారు. తెలంగాణ కేడర్‌కు ఆయషా ఫాతిమా (మధ్యప్రదేశ్), మంధారే సోహమ్ సునీల్ (మహారాష్ట్ర), మనీషా నెహ్రా (రాజస్థాన్), రాహుల్‌కాంత్ (ఝార్ఖండ్)లను కేటాయించారు.
ఆధునిక సవాళ్లే లక్ష్యంగా శిక్షణ: ప్రస్తుత కాలానికి అనుగుణంగా ప్రొబేషనర్లకు అత్యాధునిక అంశాలపై శిక్షణ ఇచ్చామని ఎన్‌పీఏ డైరెక్టర్ అమిత్ గార్గ్ తెలిపారు. ‘స్మార్ట్’ (SMART – Sensitivity, Modern, Accountable, Reliability, Technology) విధానంలో తర్ఫీదునిచ్చామన్నారు. మానవత్వాన్ని పెంపొందించేందుకు వారిని అనాథాశ్రమాలు, షెల్టర్ హోంలకు తీసుకెళ్లి అక్కడి పరిస్థితులను అధ్యయనం చేయించామన్నారు. బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ, క్రిప్టోకరెన్సీ మోసాలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డ్రోన్ల వినియోగం వంటి ఆధునిక సవాళ్లను ఎదుర్కోవడంపై ప్రత్యేక శిక్షణ ఇచ్చామన్నారు. క్షేత్రస్థాయిలో పోలీస్ స్టేషన్ల పనితీరు, నేర పరిశోధన, అభియోగపత్రాల నమోదు వరకు పూర్తిస్థాయి అవగాహన కోసం ‘మూట్ కోర్టు’లను కూడా నిర్వహించినట్లు ఆయన వివరించారు.


