యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ప్రధాన ఆలయం దివ్వ విమాన స్వర్ణ గోపురాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఆగమశాస్త్ర ప్రకారం జరిగిన ఈ స్వర్ణ తాపడం ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన సీఎం రేవంత్ రెడ్డి దంపతులు, సిఎస్, ప్రభుత్వ విప్, ఎంపీ ఎమ్మెల్యేలకు ఆలయ ఈవో భాస్కరరావు, ఆలయ ప్రధాన అర్చకులు లక్ష్మీ నరసింహచార్యులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.

వానమామలై మఠం 31వ పీఠాధిపతులు రామానుజ జీయర్ స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో ఆలయ ప్రధాన అర్చకులు లక్ష్మీనరసింహచార్యుల అర్చకతత్వం లో నిర్వహించిన మహా కుంభాభిషేక సంప్రోక్షణ పూజలో సీఎం దంపతులు, సిఎస్, ఎంపీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. అనంతరం గర్భాలయంలో లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు వేదమంత్రాలతో ఆశీర్వచనాలు అందించారు. ఆలయ ఈవో భాస్కరరావు స్వామి వారి చిత్రపటాన్ని ప్రసాదాన్ని అందజేశారు.

ఈ స్వర్ణ విమాన గోపురం దేశంలోనే ఎత్తైనదిగా రికార్డు నెలకొంది. 50.5 అడుగుల ఎత్తు 10,759 చదరపు అడుగుల వైశాల్యం. 68 కిలోల బంగారం, 3.90 కోట్ల ఖర్చుతో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు నరేందర్ రెడ్డి, ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యేలు కుంభం అనిల్ కుమార్ రెడ్డి, వేముల వీరేశం, బాలు నాయక్, ఎండోమెంట్ ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజ, యాదాద్రి జిల్లా కలెక్టర్ హనుమంతరావు, తెలంగాణ డైరీ డెవలప్మెంట్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి పలువురు అధికారులు నాయకులు పాల్గొన్నారు.


